×
Ad

శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారా? కెవ్వుకేక ఫీచర్లు.. సమయం ఆసన్నమైంది.. ఒకేసారి 3 స్మార్ట్‌ఫోన్లు..

గతంలో వచ్చిన రిపోర్టు ప్రకారమైతే శాంసంగ్ మొదట గెలాక్సీ S26 ప్రోను విడుదల చేయాలని, గెలాక్సీ S26 ఎడ్జ్‌ను గెలాక్సీ S26+ స్థానంలో ప్రవేశపెట్టాలని యోచించింది. ఇప్పుడు మాత్రం...

Samsung Galaxy S26

Samsung Galaxy S26 Series: శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను మొదట అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా నిర్వహిస్తోంది. 2026 ఫిబ్రవరి చివరలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఏఐ బేస్డ్ ఈవెంట్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నట్లు సమాచారం. రాబోయే శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా మోడళ్లు ఉండనున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ల ముఖ్యమైన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

దక్షిణ కొరియా పత్రిక మండే టుడే తెలిపిన వివరాల ప్రకారం.. శాంసంగ్ 2026 ఫిబ్రవరి 25న శాన్‌ఫ్రాన్సిస్కోలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఆ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా మోడళ్లను విడుదల చేయనుందని సమాచారం. నివేదిక ప్రకారం.. సంస్థ ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది. (Samsung Galaxy S26 Series)

శాంసంగ్ అధికార ప్రతినిధి ఒకరు తాజాగా మాట్లాడుతూ.. శాన్‌ఫ్రాన్సిస్కో ఇప్పుడు కృత్రిమ మేధస్సు కేంద్రంగా మారుతోంది కాబట్టి ఈ నగరం తమ సంస్థకు సరైన ప్రదేశం అవుతుందని తెలిపారు. దీని ద్వారా కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను విడుదల చేయడానికి సంస్థ ప్రణాళికలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది నిజమైతే, 2023 తర్వాత మూడు సంవత్సరాల అనంతరం శాంసంగ్ సాన్‌ఫ్రాన్సిస్కోలో ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది.

శాంసంగ్ సాధారణంగా తన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లను జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో నిర్వహిస్తుంది. ఈ సారి తేదీ మార్పు ఉత్పత్తి లైన్‌అప్ సర్దుబాటు కారణంగా జరిగినట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో వచ్చిన రిపోర్టు ప్రకారమైతే శాంసంగ్ మొదట గెలాక్సీ S26 ప్రోను విడుదల చేయాలని, గెలాక్సీ S26 ఎడ్జ్‌ను గెలాక్సీ S26+ స్థానంలో ప్రవేశపెట్టాలని యోచించింది. అయితే గెలాక్సీ S25 ఎడ్జ్ తక్కువ విక్రయాల కారణంగా ఆ ప్రణాళికలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3 రివ్యూ.. దీని గురించి తెలుసుకుంటే చాలు కొనేస్తారనేలా ఫీచర్లు..

మూడు గెలాక్సీ S26 సిరీస్ ఫోన్‌లు కొన్ని మార్కెట్లలో శాంసంగ్ సొంత ఎక్సినాస్ 2600 చిప్‌తో రావచ్చని, 2 నానోమీటర్ ప్రాసెస్‌పై దాన్ని తీసుకొస్తున్నారని సమాచారం. ఇతర ప్రాంతాల్లో క్వాల్‌కామ్ 3 నానోమీటర్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రావచ్చని చెబుతున్నారు.

గెలాక్సీ S26 సిరీస్ ప్రధాన స్పెసిఫికేషన్లు
లీకైన సమాచారం ప్రకారం.. గెలాక్సీ ఎస్‌26 అల్ట్రా 6.9 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ఎం14 ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రావచ్చని, కొత్త ఏఐ ఆధారిత ప్రైవసీ స్క్రీన్ ఫీచర్ అందించవచ్చని చెబుతున్నారు. ఇది 5,400 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉండవచ్చు.

ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో మెరుగైన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, అప్‌డేట్‌ చేసిన అల్ట్రావైడ్ కెమెరా, 5X ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్‌, అలాగే 12 మెగాపిక్సెల్ 1/2.55 అంగుళాల 3X కెమెరా లేదా 50 మెగాపిక్సెల్ 3X కెమెరా ఉండవచ్చని అంచనా.

గెలాక్సీ S26, గెలాక్సీ S26+ మోడళ్లలో వరుసగా 6.3 అంగుళాల, 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ఎం14 ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉండవచ్చని సమాచారం. ఈ రెండు ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 3X టెలిఫోటో కెమెరా వంటి ట్రిపుల్ కెమెరా వ్యవస్థ ఉండవచ్చు. ఇవి వరుసగా 4,300 ఎంఏహెచ్, 4,900 ఎంఏహెచ్ బ్యాటరీలతో రావచ్చు.