Petrol Mileage Cars: ఇండియాలో 20 కేఎంపీఎల్ మైలేజ్ ఇచ్చే టాప్ పెట్రోల్ కార్లు ఇవే

కొనుగోలుదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న కార్ల తయారీ సంస్థలు..అధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి, పెట్రోల్ కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు

Petrol Mileage Cars: ఇండియాలో 20 కేఎంపీఎల్ మైలేజ్ ఇచ్చే టాప్ పెట్రోల్ కార్లు ఇవే

Mileage

Updated On : April 4, 2022 / 1:28 PM IST

Petrol Mileage Cars: దేశంలో చమురు ధరలు హద్దుఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. పెట్రో భారంతో సామాన్యులు నడ్డి విరుగుతోంది. సొంత వాహనాలు ఉన్న వారి పరిస్థితి మరి దయనీయంగా మారింది. అసలే పెరుగుతున్న పెట్రోల్ ధరలకు తోడు..పెట్రోల్ వాహనాల మైలేజ్ కూడా అరకొరగా ఉండడంతో వాహనాలు బయటకు తీయాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అదే సమయంలో వాహన కొనుగోలుదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్న కార్ల తయారీ సంస్థలు..అధిక మైలేజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ లో డీజిల్ వాహనాలు అందుబాటులో లేకపోవడంపై వినియోగదారులు పెట్రోల్ వాహనాల వైపు చూస్తున్నారు. ఈక్రమంలో పెట్రోల్ కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Also read:Hypertension : హైపర్ టెన్షన్ ఉంటే ఈ 5 ఆహారాలు తినకపోవటమే మంచిది!

మారుతీ సుజుకి సెలెరియో:
భారత్ లో మారుతి సుజుకి అంటే మైలేజ్, మైలేజ్ అంటే మారుతీ సుజుకి అన్నవిధంగా వినియోగదారులను ఆకర్శించింది సుజుకి సంస్థ. భారత్ లో చిన్న కార్లలో రారాజుగా కొనసాగుతున్న మారుతి సుజుకిలో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఆల్టో, స్విఫ్ట్, బ్రెజా వంటి కార్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల సరికొత్తగా విడుదలైన సెలెరియో మాత్రం ఈ సెగ్మెంట్ లోనే అత్యధిక మైలేజ్ ఇస్తున్నట్లు సుజుకి సంస్థ వెల్లడించింది. మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లో లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ తెలిపింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్:
ఇక దేశీయంగా కార్ల అమ్మకాల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న హ్యుండయ్ సంస్థ..తమ చిన్న కారు గ్రాండ్ i10 NIOS అత్యధిక మైలేజ్ ఇస్తున్నట్లు పేర్కొంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS లీటరుకు 26.2 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీంతో పాటుగా ఈ కారులో అధునాతన ఫీచర్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అందుకే మొదటి కారు కొనాలనుకునే వినియోగదారులు ఎక్కువగా ఐ10 నియోస్ కు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది.

Also read:Scrap Ambassdor : 1000 కిలోల స్ర్కాప్ మెటీరియల్ తో అంబాసిడర్ కారు తయారు చేసిన కళాకారుడు

టాటా ఆల్ట్రోజ్
భారత కార్ల తయారీ దిగ్గజం టాటా నుండి వచ్చిన ఆల్ట్రోజ్ ఇప్పుడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ లో వినియోగదారులను తెగ ఆకట్టుకుంటుంది. టాటా ఆల్ట్రోజ్ సిటీ పరిధిలో సాధారణ ట్రాఫిక్ వేళలో లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నట్లు వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్. ఈ సెగ్మెంట్ లో హ్యుండయ్ ఐ20, మారుతి బాలెనో వంటి కార్లు ఉన్నాయి. అయితే ఆయా కార్లతో పోల్చుకుంటే ఆల్ట్రోజ్ పెట్రోల్ మోడల్ ఎక్కువ మైలేజ్ ఇస్తున్నట్లు ఇప్పటికే కారు కొన్న వినియోగదారులు పేర్కొన్నారు.

మారుతీ సుజుకి డిజైర్
మారుతి సుజుకిలో మరో కారు ఈ జాబితాలో చోటు సంపాదించింది. చాలా రోజులుగా మార్కెట్లో ఉన్న మారుతీ సుజుకి డిజైర్ సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటి. తక్కువ ధరలో సెడాన్ అనుభవాన్ని అందించడంతో పాటు, దేశంలో లభించే కార్లలో అధిక మైలేజీ ఇస్తున్న కారుగా డిజైర్ నిలిచింది. మారుతి సుజుకి డిజైర్, ముఖ్యంగా AMT వేరియంట్, లీటరుకు 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.

టయోటా గ్లాంజా
మారుతి సుజుకి బాలెనో బ్రాండ్ కు రీబ్రాండ్ గా వచ్చిన టయోటా గ్లాంజా మొదట్లో వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇటీవల గ్లాంజా ఫేస్ లిఫ్ట్ మోడల్ 2022ని మార్కెట్లోకి విడుదల చేసింది టొయోటా. గ్లాంజాలో ఇప్పుడు అద్భుతమైన ఫీచర్స్ తో పాటు మైలేజ్ కూడా బాగుందని టొయోటా సంస్థ తెలిపింది. గ్లాంజాలోని మైల్డ్-హైబ్రిడ్ మోడల్ లీటరుకు 23.87 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లు టొయోటా తెలిపింది.

Also read:Work From Office: ఉద్యోగులను క్రమంగా ఆఫీసులకు తీసుకొచ్చే పనిలో టెక్ సంస్థలు