Telangana Assembly : 24మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి..
Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలు ఆదివారం హాట్‌హాట్‌గా సాగాయి. బీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి.
Telangana Assembly
Telangana Assembly : అసెంబ్లీ సమావేశాలు ఆదివారం హాట్‌హాట్‌గా సాగాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ.. ఉదయం నుంచి బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన సమయం నుంచి బీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. అయితే, బడ్జెట్‌పై చర్చను అడ్డుకుంటున్నందుకు బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం 24మంది బీఆర్ఎస్ సభ్యులపై రెండు రోజులు సస్సెన్షన్ వేటువేశారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో..
అనిల్ జాదవ్, హరీశ్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, పద్మారావు, ప్రభాకర్, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్, పల్లా రాజేశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, కల్వకుంట్ల సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వాటికి సునీతా లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, విజయుడు, కేపీ వివేకానందలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెండ్ కానీ BRS సభ్యుల్లో మల్లారెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డిలు ఉన్నారు.
కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీ సిఫార్సుకు అసెంబ్లీ తీర్మానం..
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు సభ తీర్మానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చకు దారితీసింది. దీనిపై సీఎం రేవంత్ సైతం సీరియస్ అయ్యారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేస్తూ గన్‌తో కాలుస్తానని అన్నారని సీఎం ఆరోపించారు. అతని ప్రవర్తన అంతా వీడియో కెమెరాల్లో రికార్డయిందని పేర్కొన్నారు. కౌశిక్ వ్యవహారశైలిని సమర్థిస్తే.. అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని అన్నారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి, ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని, ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ.. అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోనున్నారు.
