Golden Idol
Golden Idol: ఓ రైతు తన పొలంలో తవ్వకాలు జరపడంతో బంగారు విగ్రహం ఒకటి దొరికింది. అది మల్లన్న స్వామి విగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేశాడు. విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు విచారణ చేపట్టి విగ్రహం స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగింది. బిల్ల నారాయణ అనే వ్యక్తి బుట్టాయిగూడెంకు చెందిన వ్యక్తితో కలిసి తన పొలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 500 గ్రాముల బంగారు మల్లన్న దేవుడి విగ్రహం దొరికింది. దీంతో అతడు దానిని తీసుకోని ఇంటికి వెళ్లి పూజలు చేయడం ప్రారంభించాడు.
అయితే నారాయణ పొలంలో జంతు బలి జరిగినట్లు గ్రామస్తులు గుర్తించారు. దానికి దగ్గర్లోనే తవ్వినట్లు ఆనవాళ్లు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. ఘటన స్థలికి చేరుకొని పరిశీలించిన పోలీసులు యజమాని నారాయణ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు.
ఇంట్లో 500 గ్రామాల బంగారం విగ్రహం కనిపించడంతో నారాయణను విచారించారు. దీంతో నారాయణ అసలు విషయం బయట పెట్టాడు. మే నెలలో తన పొలంలో మల్లన్న విగ్రహం ఉన్నట్లు కల వచ్చిందని.. దీంతో మరో వ్యక్తిని తీసుకోని మే 26 పొలంలో తవ్వకాలు జరిపామని అక్కడ ఈ విగ్రహం దొరికిందని తెలిపాడు. దీంతో విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.