Sunkari Narahari : ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. నరహరి అక్రమాస్తులు వంద కోట్లకు పైనే!
Sunkari Narahari : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై నారాయణగూడ సర్వేభవన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు.
Sunkari Narahari
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
- సుంకరి నరహరిని అరెస్టు చేసిన ఏసీబీ
- అక్రమాస్తులు వంద కోట్లకుపైనే
Sunkari Narahari : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై నారాయణగూడ సర్వేభవన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావును అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌తోపాటు మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నరహరి నివాసంతోపాటు ఆయన బంధువులు, బినామీల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు.
సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరి ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రినాకలోని సుంకరి నరహరి నివాసం.. నారాయణగూడ సర్వే భవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు.
సోదాల్లో భాగంగా రూ.13.05 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో ఐదు ప్లాట్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన ఫ్లాట్, నార్సింగిలో రెండు లగ్జరీ ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో మరో నివాస ఫ్లాట్‌కు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి.
గచ్చిబౌలిలో జీ ప్లస్ త్రీ భవనం, ఛత్రినాకలో జీ ప్లస్ 2 భవనం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నరహరి నివాసంలో రూ.1.54కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. అదనంగా రూ.5.04 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో 1.3 కిలోల బంగారు ఆభరణాలు, ఎనిమిది కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నరహరి భార్య పేరిట ఉన్న రెండు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించిన అధికారులు.. వాటిని త్వరలో తెరచి పరిశీలించనున్నట్లు తెలిపారు. కారును కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం నరహరిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.
