CMR College Issue : మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ బాలికల వసతి గృహం దగ్గర ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘాల రాకతో ఆందోళన మరింత తీవ్రమైంది. ఆందోళన చేసేందుకు విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. అయితే, కాలేజీ గేటును సిబ్బంది తెరవకపోవడంతో ఏబీవీపీ మహిళా నాయకులు గేట్లు దూకి లోపలికి దూసుకెళ్లారు. గేటు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు.
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు..
మరోవైపు సీఎంఆర్ కాలేజీకి విద్యార్థినుల తల్లిదండ్రులు చేరుకుంటున్నారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారిని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ మహిళా నాయకులు నినాదాలు చేశారు.
ఉదయం నుండి కూడా కాలేజీ దగ్గర ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. అటు పోలీసులు అలర్ట్ అయ్యారు. సీఎంఆర్ కాలేజీకి సంబంధించిన అన్ని గేట్లను పోలీసులు క్లోజ్ చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. అటు మా కాలేజీలోకి వెళ్లేందుకు కూడా మమ్మల్ని ఎందుకు అనుమతించరని విద్యార్థులు వాదనకు దిగారు.
Also Read : వీడెవడండీ బాబూ.. ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.. వీడియో వైరల్..
సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ లో వీడియోల రికార్డింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై చేతి గుర్తులు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. బయటి నుంచి కెమెరా పెట్టినట్లు అద్దంపై ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు మూడు చోట్ల కెమెరా పెట్టినట్లుగా అనుమానం కలుగుతోంది. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
అమ్మాయిల బాత్రూమ్ లో కెమెరాలు.. 300 వీడియోలు రికార్డ్?
మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో వీడియోల చిత్రీకరణ అంశంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక, గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు అమర్చి సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలపై ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : తెలంగాణలో బాలికల గురుకులాలపై ఫోకస్.. అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు