Tiger Tension : ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పెద్ద పులి భయం..

పులి భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.

Tiger Tension : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పెద్ద పులి. గత నెల రోజులుగా పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కవీట్ పేట్ దగ్గర మహిళపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పులి దాడితో మరోసారి సరిహద్దు గ్రామాల్లో అలజడి మొదలైంది. కవీట్ పేట్ లో సంచరిస్తున్న పెద్ద పులి కొమురంభీమ్ జిల్లాలో పశువులపై దాడి చేసిన పెద్ద పులిగా భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులి కోసం ఇరు రాష్ట్రాల అటవీశాఖ సిబ్బంది గాలిస్తున్నారు.

నిద్ర లేకుండా చేస్తున్న పులి భయం..
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలకు మరోసారి పెద్ద పులి భయం పట్టుకుంది. నిన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కవీట్ పేట్ గ్రామంలో పెద్ద పులి ఒక మహిళపై దాడి చేసి హతమార్చింది. పులి దాడిలో తీవ్ర గాయాలపాలైన కవీట్ పేట్ కు చెందిన మహిళ మృత్యువాత పడింది. కొమురంభీమ్ జిల్లాలో వరుసగా మనుషులు, పశువులపై దాడి చేస్తున్న పెద్ద పులిగా అధికారులు భావిస్తున్నారు.

రీసెంట్ గా ఇదే పులి మాకోడి రైల్వే స్టేషన్ సమీపం నుంచి మహారాష్ట్ర వైపు నుండి తెలంగాణలోకి పులి ప్రవేశించింది. ఉడికిలి మీదుగా వెంపల్లి చీలపల్లి అటవీ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఈ పెద్ద పులి సంచరించింది. పులి సంచారానికి సంబంధించి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పెద్ద పులి మళ్లీ చీలపల్లి వెంపల్లి అటవీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర సరిహద్దు దాటి నిన్న మహిళను హతమార్చింది. అదే ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు మహారాష్ట్రకు చెందిన అధికారులు చెబుతున్నారు.

Also Read : 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్‌ జీవీ రెడ్డి

రెండున్నర నెలలుగా భయాందోళనలు..
పులి మళ్లీ ఎప్పుడన్నా ఇదే ప్రాంతం నుంచి తిరిగి ఉడికిలి మీదుగా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇదే పెద్ద పులి గత రెండున్నర నెలలుగా చాలా గ్రామాల ప్రజలను భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది.

వెంటనే అటవీ శాఖ అధికారులు ఈ పులిని పట్టుకోవాలని చాలా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్నాళ్లు పశువులపై దాడి చేసిన పులి.. ఇప్పుడు మనుషులపై దాడి చేసి హతమారుస్తోంది. ఇప్పటికే కాగజ్ నగర్ డివిజన్ లో ఓ మహిళ పులి దాడిలో మృత్యువాత పడింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా మహారాష్ట్ర బోర్డర్ లో మహిళను పులి హతమార్చడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

Tiger Tension (Photo Credit : Google)

పులి భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వ్యవసాయ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పొలాల్లో పత్తి, కంది ఏరడానికి మనుషులు, కూలీలు లేక రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

 

Also Read : అందుకే అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు: డీకే అరుణ