AICC Spokesperson Pawan Khera
Pawan Khera: లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే కదలిక వచ్చిందని, లిక్కర్ స్కాంపై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్సేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్ రావ్ థాక్రేతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం, ఒత్తిడి వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందని అన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో మహిళల హక్కులకోసం ఎన్నిసార్లు మాట్లాడిందని పవన్ ఖేరా ప్రశ్నించారు లిక్కర్ స్కాం తెరపైకిరాగానే కవితకు మహిళా సాధికారత గుర్తుకురావడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
సామాన్య ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీకోసం వాడుకుంటున్నారని, బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని పవన్ ఖేరా అన్నారు. శంషాబాద్‌లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని, బీఆర్ఎస్‌లో ఇంకో మహిళ లేనట్లు కవిత ఒక్కరి ఫొటోనే కనిపిస్తుందని విమర్శించారు. తెలంగాణ తప్పితే వేరే రాష్ట్రంలో ఒక్క సర్పంచ్‌ని బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకునే పరిస్థితి లేదని అన్నారు.
Delhi Liquor Scam : మోదీ జిందాబాద్ అంటే కవితను వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారు : సీపీఐ నారాయణ
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మానిక్ రావ్ థాక్రే మాట్లాడుతూ.. ఛత్తీస్‌గడ్‌లో మా ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు చాలా తేడాఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి ఎన్నికలకోసం డబ్బులు రెడీ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేసే మోసాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా సీరియస్ గా పోరాటం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీనేనని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మేం అధికారంలోకి రావడం ఖాయమని థాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పోరాటం బీజేపీతోనే అంటూ బీఆర్ఎస్ కలరింగ్ చేస్తుందని, మోదీ ఇమేజ్ డ్యామేజ్ కూడా కేసీఆర్ కాపాడుతున్నాడని అన్నారు.