హైదరాబాద్‌లో ఘనంగా గణనాథుల నిమజ్జనం.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం
నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

Hyderabad Ganesh Immersion : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి కౌంట్ డౌన్ మొదలైంది. గణేశ్ ఉత్సవాల్లో మొదటి రోజు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో చివరి రోజు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. నిమజ్జనం తంతును ప్రశాంతంగా చేసేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి హుస్సేన్ సాగర్ పరిసరాల్లో రెండు వైపుల మాత్రమే నిమజ్జనం చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ లో మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గణేశ్ నిమజ్జనానికి ఈసారి 20వేల మందితో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసింది సర్కార్. నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అటు గణనాథుల నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద 11 క్రేన్లు ఏర్పాటు చేశారు అధికారులు.
9 రోజుల పాటు భక్తి శ్రద్దలతో గణనాథుడిని పూజించిన భక్తులు.. గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు వినాయగ సాగర్ వైపు తరలివస్తున్నారు. ఉత్సవాలు మొదలైన 5వ రోజు నుంచి నిమజ్జనానికి వస్తున్నారు. మరో 2 రోజులు గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కొలువుదీరిన సుమారు 5 నుంచి 10 అడుగుల లోపున్న విగ్రహాల నిమజ్జనం కొన్ని రోజులుగా జరుగుతోంది. నిమజ్జనానికి సంబంధించి హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ లో మాత్రమే నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది.
గతేడాది 30 వేల నుంచి 40 వేల వరకు విగ్రహాలు వినాయక సాగర్ నిమజ్జనమైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈసారి కూడా ఇంచుమించుగా 35 వేల నుంచి 40వేల లోపు వరకు విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. భారీ విగ్రహాలను మాత్రమే ఎన్టీఆర్ ఘాట్ మార్గంలోని 9 క్రేన్ల వద్ద వాటిని నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇక ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి సంబంధించి భారీ క్రేన్ ను సిద్ధం చేశారు. 70 అడుగుల ఎత్తు, వందల టన్నుల బరువు ఉండే విగ్రహం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తైతే సగం నిమజ్జన కార్యక్రమం పూర్తైనట్లుగా భావిస్తారు.
Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవలో జోక్యం వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటి?