Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం.. ఆ రెండు అంశాలే ప్రధాన అజెండా

పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.

Telangana Assembly Special Session : కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలే అజెండాగా ప్రత్యేక శాసన సభ సమావేశానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ సమావేశాల్లో బీసీ కులగణన నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ను ప్రభుత్వం సభలో చర్చకు పెట్టనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఆలోపే రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనుకుంటోంది ప్రభుత్వం.

అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న తెలంగాణ సర్కార్..
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే అందుకు పార్లమెంటులో చట్టసవరణ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనుంది ప్రభుత్వం.

Also Read : తెలంగాణలో డ్రై పోర్ట్.. ఎక్కడ నిర్మిస్తారు? ఉపయోగాలు ఏంటి? పూర్తి వివరాలు..

ఈ చర్చలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులను భాగస్వామ్యులను చేసి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించనుంది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.

కులగణనకు గతేడాది ఫిబ్రవరి 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2న ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ అందించారు. కులాల వారీగా ఎవరికి ఎంత శాతం అనేది రిపోర్ట్ లో తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్లీ సమావేశానికి గంట ముందు క్యాబినెట్ ముందు సబ్ కమిటీ పెట్టనుంది.

ఎస్సీ వర్గీకరణపై రిపోర్టు అందజేత..
సబ్ కమిటీ రిపోర్ట్ ను క్యాబినెట్ ఆమోదించి సభలో చర్చకు పెట్టనుంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయడం కోసం ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ సూచన మేరకు ఏక సభ్య కమిషన్ ను నియమించింది. ఎస్సీ వర్గీకరణలో తలెత్తే ఇబ్బందులు, పరిష్కారంపై సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కు నివేదిక ఇచ్చింది కమిషన్. ఈ నివేదిక కూడా అసెంబ్లీలో పెట్టనున్నారు.

Also Read : బాప్ రే.. ఒక్క ఫోన్ కాల్‌తో 11 లక్షలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని.. బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు.. ఏం జరిగిందో తెలిస్తే షాకే..

ఎస్సీ వర్గీకరణలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 50శాతం రిజర్వేషన్లపై నియంత్రణ ఉండటంతో.. ప్రస్తుతం రిజర్వేషన్లు పెంచడం సాధ్యమా అనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో 50శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వడంతో ఆ తరహా పద్ధతినే అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఎక్స్ పర్ట్స్ తో చర్చలు..
దీనికి సంబంధించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఎక్స్ పర్ట్స్ తో ప్రభుత్వం చర్చించనుందని సమాచారం. క్యాబినెట్ తీసుకునే నిర్ణయాన్ని సభలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. సభలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఇక ఎస్సీ వర్గీకరణ పై కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది.