Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సర్వం సిద్ధం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కొచ్చు.

CM Revanth Reddy
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగల్ ఇచ్చింది. రేపు సాయంత్రం లేదంటే బుధవారం క్యాబినెట్ విస్తరణ ఉండనుంది. ప్రస్తుతం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీలో ఉన్నారు. ఆయన రేపు హైదరాబాద్‌కు రానున్నారు. 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కొచ్చు. రాజ్‌భవన్ నుంచి ఉత్తర్వుల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశం కొన్ని నెలలుగా డైలీ ఎపిసోడ్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం అన్నింటినీ క్లియర్ చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీఏసీ, అడ్వైజరీ, క్రమశిక్షణ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన కమిటీలను నియమించింది.
Also Read: తల్లికి వందనం నగదు పంపిణీ… 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలపై చంద్రబాబు కీలక ప్రకటన
ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశాన్ని పార్టీ అధిష్ఠానం కొలిక్కి తీసుకురావడంతో ఇక రాజ్‌భవన్ నుంచి ఉత్తర్వుల కోసం ఆశావాహులు వేచిచూస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశంపై తీవ్ర కసరత్తు చేశారు.
క్యాబినెట్ విస్తరణ, రాష్ట్ర పార్టీ కమిటీ భర్తీ విషయాన్ని మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. మీనాక్షి హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి ఆశావహులంతా ఒత్తిడి తీసుకొచ్చారట. దీంతో ఆమెకు ఆ సమయంలో చిరాకు కూడా వచ్చింది. పార్టీ అధిష్ఠానం దగ్గర కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. పార్టీ కమిటీలతో పాటు క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాల్సిందేనని, లేదంటే తాను పనిచేయలేనని హైకమాండ్‌కు మీనాక్షి నటరాజన్ వివరించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది.
మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ కమిటీల నియామకం విషయంలో ఇప్పటికే ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. అనుకున్న సమయంలోగా సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, కాంగ్రెస్ ముఖ్యనేతల పంథాలు, పట్టింపులతో ఇప్పటివరకు మంత్రి వర్గ విస్తరణ అంశం కొలిక్కిరాలేదు. చాలాసార్లు ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు జరిపినా అది ఫలించలేదు.