Aminpur Three Childrens incident
Hyderabad: అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల మృతికేసు తీవ్ర కలకలం సృష్టించింది. వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తండ్రి చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో శుక్రవారం తెల్లవారు జామున ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. వారి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన ఆవురిజింతల చెన్నయ్య 20ఏళ్ల క్రితం అమీన్ పూర్ కు ఉపాధికోసం వచ్చి నీళ్ల ట్యాంకర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య రజిత ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ (12), మధు ప్రియ (10), గౌతమ్ (8) ఉన్నారు.
ముగ్గురు పిల్లలు, తల్లి రజిత గురువారం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. భోజనం సమయంలో పెరుగన్నం కూడా తిన్నారు. చెన్నయ్య ఇంటికి వచ్చే సరికి రాత్రి 11గంటలు అయింది. భార్య తలుపు తీసి మళ్లీ పడుకుంది. అప్పటికే పిల్లలు నిద్రపోతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో రజిత కడుపునొప్పి ఉందంటూ కేకల్ వేయడంతో ఆమెను అమీన్ పూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పిల్లలను చూడగా.. ముగ్గురు నిద్రలోనే మృతి కనిపించారు. రజితను ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. రాత్రి షాపు నుంచి పెరుగు తెచ్చుకున్నామని, ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నామని తెలిపింది. అయితే, తాను ఎలాంటి విషపదార్థాలు చిన్నారులకు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల తండ్రి చెన్నయ్యను అదుపులోకి తీసుకొని విచారించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ముగ్గురు చిన్నారులు ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు.
చెన్నయ్య, రజితల మధ్య గొడవులు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, చెన్నయ్యకు రజిత రెండో భార్య. 2010లో అతని మొదటి భార్య ప్రసవ సమయంలో చనిపోగా.. 2013లో రజితను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాలన్నింటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.