గ్రేటర్‌లో మరో 50 ‘అన్నపూర్ణ’ సెంటర్లు.. రోజూ 2 లక్షల మందికి భోజనం

కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు నమోదవుతూనే ఉండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది.

కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు నమోదవుతూనే ఉండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది. ప్రత్యేకించి లాక్ డౌన్ సమయంలో గ్రేటర్ పరిధిలో ఉండే చాలామందికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆహారం అందని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నపూర్ణ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఆకలితో ఉన్నవారి ఆకలిని తీరుస్తోంది.

ఇప్పటికే పలు అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 50 అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. నగరంలో ఎవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదని సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 300 అన్నపూర్ణ సెంటర్లలో దాదాపు 2 లక్షల మందికి రోజూ భోజనాన్ని అందిస్తున్నామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. GHMC, 9 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు.

ఉదయం 10.30 గంటల నుంచి గంటన్నరపాటు, సాయంత్రం 5 గంటలకు మరోసారి భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి సర్కిల్‌లో ఒక ప్రత్యేక రెడిమేడ్‌ కుకుడ్‌ ఫుడ్‌ వాహనాన్ని సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే GHMC కాల్‌సెంటర్‌ నంబర్‌ 2111 1111 కాల్‌ చేయాలని ఆయన సూచించారు.