తమ శాఖలో ఆ అధికారులను వద్దంటున్న పలువురు మంత్రులు

అధికారులు, మంత్రుల మధ్య అసలు సమన్వయమే లేకుండా వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది.

తమ శాఖలో ఆ అధికారులను వద్దంటున్న పలువురు మంత్రులు

Telangana New Secretariat

Updated On : May 16, 2025 / 8:48 PM IST

మంత్రులంటే ఉన్నతాధికారులకు లెక్కలేదా? అమాత్యుల ఆదేశాలను బ్యూరోక్రాట్స్ పట్టించుకోవడంలేదా? దీంతో ప్రభుత్వంలో మంత్రులకు, ఉన్నతాధికారులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? మినిస్టర్స్ సూచనలను సీఎంవో అధికారులు బేఖాతర్ చేస్తున్నారా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజులుగా వివిధ శాఖల్లో జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న చర్చ సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ మంత్రులకు-సీఎంవో కార్యాలయం మధ్య అసలేం జరుగుతోంది. ఎందుకని అమాత్యుల మాటలను అదే శాఖలో పని చేస్తున్న ఉన్నతాధికారులు లెక్కచేయడంలేదు? వాచ్ దిస్ స్టోరీ.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులకు, ఉన్నతాధికారులకు మధ్య అంతగా పొసగడంలేదన్న వార్తలు విన్పిస్తున్నాయి. మంత్రులు, అధికారుల మధ్య ఎక్కడా సమన్వయం కుదరడంలేదన్న వార్తలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారాయి. మంత్రుల సూచనల మేరకు పని చేయాల్సిన ఉన్నతాధికారులు నిబంధనల సాకుతో వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: ట్రంప్ మరో షాక్.. అమెరికా నుంచి డబ్బు పంపే NRIలకు ఝలక్..

పదిమంది మంత్రుల్లో మెజారిటీ మంత్రులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయన్న గుసగుసలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయ్..మంత్రులుగా ఉన్న తమ మాట కూడా తమ శాఖ అధికారులే వినకపోతే ఇంకెవరి మాట వింటారంటూ అమాత్యులు ఫైర్ అవుతున్నారట. మంత్రులు-అధికారులు పాలు, నీళ్లలా కలిసిపోయి పరిపాలనను పరుగులు పెట్టించాల్సింది పోయి…ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇద్దరి మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుందట.

దీంతో కొంతమంది మంత్రులు..తమ తమ పేషీల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు, వాటి అమలు కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సంక్షేమ పథకాలపై, పాలనలో తమ మార్కు వేసుకునేలా మంత్రులు పావులు కదుపుతున్నా అధికారులు మాత్రం..అమాత్యుల ఆదేశాలను ఎక్కడికక్కడ బ్రేకులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయా శాఖల్లో గుస గుసలు విన్పిస్తున్నాయి.

అధికారిపై మంత్రి సీతక్క ఆగ్రహం?
ప్రభుత్వ ప్రాధాన్యతలు ఒకటైతే అధికారుల ప్రాధాన్యతలు మరోలా ఉంటుండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తుందన్న చర్చ సచివాలయవర్గాల్లో జరుగుతోంది. ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్ కనీసం సంబంధిత మంత్రి సీతక్కకి సమాచారం ఇవ్వకుండా టెండర్లను రద్దు చేయడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. ఈ విషయం తెలిసిన మంత్రి సీతక్క…సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే ఆది తనకు సంబంధం లేదని .. పై అధికారులు నిర్ణయం తీసుకున్నారంటూ సదరు అధికారి చెప్పినట్లు తెలిసింది . ఇక టూరిజం పాలసీ విషయంలోను సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే పాలసీలో మార్పులు చేయడంతో పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాఖ ఉన్నతాధికారిపై అసహనం వ్యక్తం చేశారనే టాక్ అప్పట్లో వినిపించింది .. అటు ఎక్సైజ్ శాఖలోనూ నిబంధనలను బూచిగా చూపిస్తూ అధికారులు మంత్రి మాట వినడం లేదట .. ఇక ఆర్ &అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల కొన్ని పనులను చేసిపెట్టాలని ఆదేశించినా సదరు ఉన్నతాధికారి ఆ పనులు చేయడం సాధ్యంకాదని మంత్రి ముందే స్పష్టం చేశారట.

ఫలానా పని చేయాలని తాను చెప్పినా అధికారి సాధ్యంకాదని చెప్పడంతో మంత్రి సైతం సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ఇక ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా తన శాఖల పరిధిలోని ఓ ఉన్నతాధికారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలన్నా .. ఆయన ఎప్పడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక తల పట్టుకుంటున్నారట … అటు ఇరిగేషన్ శాఖలో కూడా ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు గతంలో చర్చనీయాంశంగా మారిందట.

సదరు అధికారి కి మంత్రి కాల్ చేసినా రెస్పాండ్ కాకపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది .. ఇదంతా ఒక ఎత్తైతే మరికొందరు మంత్రులు తమ శాఖ అధికారులకు ఇతర మంత్రులెవరూ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవద్దని హుకుం జారీ చేస్తున్నారట .. దేనితో ఆయా శాఖలా ఉన్నతాధికారులెవరూ ఇతర మంత్రుల కాల్స్ కూడా అటెండ్ అవ్వడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి

మంత్రులు, అధికారులు సమన్వయంతో కలిసి పని చేస్తేనే అప్పుడప్పుడూ సమస్యలు పరిష్కరం కావడంలో కొంత జాప్యం జరుగుతుంటుంది. కానీ అధికారులు, మంత్రుల మధ్య అసలు సమన్వయమే లేకుండా వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అమాత్యులు కూడా వారి తీరుపై ఎలా వ్యవహరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

అంతేకాదు…తమ తమ పేషీల్లో కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ కూడా తమ అనుమతి, ప్రమేయం లేకుండా నేరుగా సీఎంవో కార్యాలయంతోనే కొందరు అధికారులు సంప్రదిస్తు క్లియర్ చేసుకోవడంపైన కూడా మంత్రులు తీవ్ర ఆగ్రహం తో తమలో తామే గింజుకుంటున్నారట.

తమ పేషీల్లోనే పనిచేస్తూ తమకే తెలియకుండా నేరుగా సీఎంవో ఆఫీసు నుంచే ఉన్నతాధికారులు పనిచేస్తుండడాన్ని అమాత్యులు జీర్ణించులేకపోతున్నారట.. ఓ మంత్రి పని తీరుపై ఫిర్యాదులు రావడంతో ఆ శాఖ ఫైల్స్ ను సీఎం రేవంతే నేరుగా పరిశీలిస్తున్నారన్న టాక్ సచివాలయవర్గాల్లో కలకలం రేపుతోంది … అయితే తమ తమ శాఖలపై అమాత్యులు పట్టు సాధించకపోవడంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారం మాత్రం సచివాలయం లో తీవ్ర చర్చకు దారితీస్తుంది

మరి ఇప్పటికైనా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు మినిస్టర్స్ ఆదేశాలను పాటిస్తారా? లేక ఎప్పటిలాగే డోంట్ కేర్ అనే రీతిలోనే ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రుల మాట వినని అలాంటి ఉన్నతాధికారులపై సీఎం రేవంత్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.