నెక్లెస్‌రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది.. దాన్ని తొలగిస్తారా?: అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్

నెక్లెస్‌రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని.. దాన్ని కూడా తొలగిస్తారా అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.

Asaduddin Owaisi hot comments on Hyderabad Hydra demolitions

Asaduddin Owaisi  on Hydra demolitions: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్ప్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కూల్చివేతలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారని, వాటిని కూడా కూల్చేస్తారా అని హైడ్రాను ప్రశ్నించారు. నెక్లెస్‌రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని.. దాన్ని కూడా తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేది.. మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటని అడిగారు.

చాలా చోట్ల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్‌), బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు. ”గోల్కొండలో కూడా గోల్ఫ్ కోర్టు ఉంది. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడతారు. అక్కడికి వెళ్లి చూడండి.. లేదంటే ఫోటోలు కావాలంటే నేను ఇస్తా. ఎఫ్‌టీఎల్‌ సమస్యపై హైదరాబాద్ నగర మేయర్‌ని కలిసి చెప్పాను. ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటారో చూడాల”ని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

కాగా, నిబంధనలకు విరుద్ధంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను శనివారం కూల్చివేసింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలతో హైడ్రా ఈ చర్య తీసుకుంది. దీనిపై దీంతో హీరో నాగార్జున స్పందిస్తూ తప్పుడు సమాచారంతోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేశారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు.

Also Read: చెరువులు ఆక్రమించిన వారిని ఎవర్నీ వదలం.. రాజకీయాలకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు నోటీసులు
మణికొండ చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారుల నోటీసులు జారీ చేశారు. జీవో 658కి విరుద్దంగా ROW హౌస్ల నిర్మాణాలు చేపట్టారని, జీ+1కు అనుమతులు పొంది జీ+2 నిర్మాణాలు కట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 7 విల్లాలను మునిసిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే కూలగొట్టారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటికి రూ. 50 కోట్ల నష్టం జరిగిందని ప్రస్తుత సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు