Eatala Rajender Key Promise (Photo : Facebook)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలవాలని, అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అవుతాయని, బీఆర్ఎస్ మూడవ స్థానంలో నిలుస్తుందని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ డబ్బు, మద్యం, పోలీసులను నమ్ముకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.
Also Read : తెలంగాణ పోరులో వారసులు విజయం సాధిస్తారా? హోంశాఖ మంత్రుల వారసులకు దక్కని అవకాశం
బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేస్తామని ఈటల హామీ ఇచ్చారు. కేసీఆర్ వచ్చాక సింగరేణిలో కార్మికుల సంఖ్య 39 వేలకు పడిపోయిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనులు ఏర్పాటు చేస్తామని సింగరేణిని ప్రైవేటు చేతిలో పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు ఈటల. బీజేపీ ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని వాగ్దానం ఇచ్చారు ఈటల రాజేందర్.
సింగరేణి కార్మికులు ప్రతి ఏటా ఇన్ కమ్ ట్యాక్స్ రూపంలో వేల రూపాయలు చెల్లిస్తున్నారు. కాగా, ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానికే పోతోందని సింగరేణి కార్మికులు వాపోతున్నారు. ఆర్మీ, నేవీ ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా ఆదాయపు పన్నులో మినహాయింపు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి తాము పడుతున్న శ్రమను అర్థం చేసుకోవాలని, ఆదాయపు పన్నులో మినహాయింపు ఇవ్వాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు.
Also Read : దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత సీఎం ప్రకటన చేయాలి : వైఎస్ షర్మిల
భూమి పొరల్లోకి వెళ్లి బొగ్గును వెలికితీసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారెందరో ఉన్నారు.. అలాంటి కార్మికుల నుంచి ఆదాయ పన్ను వసూలు చేయడం సరికాదని పలు పార్టీల నాయకులు అంటున్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయ పన్ను రద్దుకు కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలంటున్నారు.