KTR : మరో ఛాన్స్ ఇస్తే దేశంలోనే నెంబర్ వన్ చేస్తా- కేటీఆర్

Minister KTR Promise : మళ్లీ అవే దిక్కుమాలిన రోజులు రావాలంటే మీ ఇష్టం. కాంగ్రెస్ వాళ్లు మళ్లీ వచ్చి మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

Minister KTR Promise (Photo : Google)

ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు మంత్రి కేటీఆర్. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో దూకుడు పెంచారు. మరోసారి తనకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

మీ దీవెనలతో ఆశీర్వదిస్తే సిరిసిల్ల నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చాను అని అన్నారు. ఊరూరికి, ఇంటింటికి రాలేని పరిస్థితి ఉందని కేటీఆర్ వాపోయారు. సిరిసిల్లలో ఇంత అభివృద్ధి జరుగుతుందని, జిల్లా అవుతుందని అనుకున్నామా? ఎప్పుడు చూసినా తంగళ్ళపల్లి బ్రిడ్జి కింద సముద్రంలా నీరుంటుందని అనుకున్నామా? అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ప్రతిరోజూ శివరాత్రి జాగరణే ఉండే అన్నారు. కాంగ్రెస్ కు 11 ఛాన్సులు ఇచ్చాము, కానీ ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చింది కాలిపోయిన, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు అని విమర్శించారు. ”ఎర్రటి ఎండల్లో చెరువులు నిండు కుండల్లా ఉన్నాయి. ఇన్ని విద్యా సంస్థలు సిరిసిల్లకు వస్తాయని ఊహించారా? 55ఏళ్ళలో జిల్లాలు చేయలే. 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు. కానీ, కేసీఆర్ ఇచ్చారు.

Also Read : సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నేత

మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి రావాలని అపెరల్ పార్క్, ఆక్వా హబ్ లను ఏర్పాటు చేసుకుంటున్నాం. 18ఏళ్లు నిండిన ఆడపడుచులకు 3వేలు ఇవ్వబోతున్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. అసైన్డ్ భూములు ఉన్న హరిజనులు అందరికీ డిసెంబర్ 3 తర్వాత పూర్తి హక్కులు ఇవ్వబోతున్నాం.

రైతులకు 24 గంటల కరెంటు ఎందుకు? 3గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. సరిపోతుందా? మళ్లీ అవే దిక్కుమాలిన రోజులు రావాలంటే మీ ఇష్టం. అవ్వకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడా అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ వాళ్లు మళ్లీ వచ్చి మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త. మీ నెత్తిమీద భస్మాసుర హస్తం పెట్టడానికి వస్తున్నారు.

Also Read : కేసీఆర్ అలా చేస్తే కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుంది. అలాగే కేసీఆర్ ఒక్కరే వస్తున్నారు. మళ్లీ ఒకసారి ఆశీర్వదిస్తే ఈ తొమ్మిదేళ్లలో చేసిందాని కంటే 2 రెట్లు అభివృద్ధి చేసి భారత దేశంలోనే నెంబర్ వన్ గా నిలుపుతా. ఇన్ని పథకాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ ని మరొకసారి ఆశీర్వదించండి” అని కోరారు కేటీఆర్.