హైదరాబాద్ తర్వాత కరీంనగరే, సొంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి బండి సంజయ్ స్కెచ్

bandi sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బండి సంజయ్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టి… మెల్లమెల్లగా మార్పులు చేస్తూ వస్తున్నారు. పార్టీ నూతన కమిటీ విషయంలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చారు. పదవుల విషయంలో ఎన్నో ఆరోపణలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఇప్పటి దాకా రాష్ట్ర స్థాయిలో దృష్టి పెట్టిన సంజయ్ ఇక తన సొంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి స్కెచ్ వేశారట. పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా… కేడర్ బాధ్యతలను అప్పగించేందుకు సరికొత్తగా ఆలోచిస్తున్నారనేది కమలనాథుల్లో జరుగుతున్న చర్చ.
కరీంనగర్‌లో బీజేపీ గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు:
సంజయ్ ఎంపీగా గెలిచి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కరీంనగర్‌లో బీజేపీ గురించి అంతగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు చాలానే వచ్చాయి. మరోవైపు పార్టీలో చీలికలు కూడా వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇప్పుడు సంజయ్ తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్‌పై దృష్టి పెట్టి, పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త కమిటీలను వేశారు. పట్టణ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తున్న సంజయ్… కరీంనగర్ పట్టణంలో ఉన్న 60 డివిజన్లను, 12 చొప్పున విడదీసి, ప్రతి 12 డివిజన్లకి ఒక్కో కీలక నేతని అధ్యక్షుడిగా నియమించారు.
హైదరాబాద్‌లో అవలంబిస్తున్న వ్యూహాన్నే కరీంనగర్‌లోనూ ఇంప్లిమెంట్:
కరీంనగర్ పట్టణంలో ఇప్పుడు ఈస్ట్, వెస్ట్ నార్త్, సౌత్, సెంట్రల్ ఇలా మొత్తం ఐదుగురు అధ్యక్షులను నియమించారు. ఇలా చేయడం ద్వారా పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు పార్టీ ప్రజల్లో ఉండేలా చేయడమే సంజయ్ టార్గెట్‌గా ఉందని అంటున్నారు. హైదరాబాద్‌లో అవలంబిస్తున్న వ్యూహాన్నే సంజయ్, కరీంనగర్‌లోనూ ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది పొలిటికల్ టాక్. సంజయ్ కరీంనగర్‌లో ఓ కొత్త మార్పునకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు నియమించిన ఐదుగురు నగర అధ్యక్షులతో పార్టీ యాక్టివిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంటుందనే బీజేపీ ఆలోచన.
హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌లో ఐదుగురు అధ్యక్షుల ఫార్ములాను వాడుతున్న సంజయ్… ఇది సక్సెస్ అయితే మాత్రం మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఏదీ ఏమైనా కరీంనగర్‌లో బీజేపీకి కొత్త మార్పులతో కాస్త కొత్త లుక్ వచ్చినట్లయింది.
https://www.youtube.com/watch?v=5sv9a8CLWv4