Dog attack
Hyderabad: క్రెడిట్ కార్డు బిల్లు వసూలు చేసేందుకు వెళ్లిన రికవరీ ఏజెంట్ పై కుక్క దాడి చేసింది. కాళ్లు, పిక్క కొరికేసింది. దీంతో సదరు ఏజెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, యాజమానే కావాలని తనపై కుక్కను వదిలాడని పేర్కొంటూ బాధితుడు మధురానగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధురానగర్ లో ఉండే నందివర్ధన్ రావు ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నాడు. కార్డు పై రూ.2లక్షల వరకు అవుట్ స్టాండింగ్ ఉంది. ఆ బిల్లును వసూలు చేసేందుకు బ్యాంక్ రికవరీ ఏజెంట్ సత్యనారాయణ నందివర్దన్ రావు ఇంటికి వెళ్లాడు. నందివర్దన్ ఎక్కడ అంటూ కుటుంబ సభ్యులను ప్రశ్నించాడు. ఇంట్లో లేడని వారు సమాధానం ఇచ్చారు. ఆ తరువాత రికవరీ ఏజెంట్ ఆగ్రహంతో అరుచుకుంటూ వెళ్లిపోతుండగా ఇంటి బయట నందివర్దన్ రావు ఎదురుపడ్డాడు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
నందివర్దన్ రావు, రికవరీ ఏజెంట్ సత్యనారాయణ ఒకరిపైఒకరు దాడి చేసుకుంటున్న క్రమంలో తన యాజమానిని కొడుతున్నాడని గ్రహించిన కుక్క సత్యనారాయణ పై దాడిచేసి కాళ్లు, పిక్క కొరికేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సత్యనారాయణ మధురానగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను క్రెడిట్ కార్డు డబ్బులు అడగడానికి వెళ్లగా కస్టమర్ నందివర్దన్ రావు కుక్కను ఉసిగొల్పాడని ఏజెంట్ సత్యనారాయణ చెబుతుండగా.. తనపై దాడి చేయడాన్ని చూసి తన కుక్క ఏజెంట్ పై అటాక్ చేసిందని నందివర్దన్ రావు చెబుతున్నాడు.