Indiramma Indlu: ఇందిరమ్మ లబ్ధిదారులూ బీ అలర్ట్.. తప్పుడు సమాచారం ఇస్తే ఇబ్బందులే.. వెంటనే పట్టేస్తోన్న ఏఐ..! ఎలా అంటే..?
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.

Indiramma House Scheme
Indiramma Indlu: రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో 562 గ్రామాల పరిధిలో 70,122 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 46,432 ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు. అయితే, 17వేల మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 4,500 ఇళ్లకు పునాది పూర్తయినట్లు ఆన్ లైన్ లో నమోదు చేశారు. అయితే, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read: మరోసారి హరీశ్ రావు ఇంటికి కేటీఆర్.. వారిద్దరి మధ్య చర్చకొచ్చిన అంశాలివే..
మొదటి దశలో బిల్లుల మంజూరులో భాగంగా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన వివరాలను అధికారులు ఏఐ సాంకేతికతతో జల్లెడ పడుతున్నారు. ఇందిరమ్మ యాప్ లో గుంతలు, పునాధి, పిల్లర్లు, స్లాబు, గోడలు, ఇంటి స్వరూపం వంటి వాటి ఫొటోలను ముందే నమోదు చేశారు. దరఖాస్తుదారులకు సంబంధించిన 360 డిగ్రీల సమాచారమూ నిక్షిప్తమై ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుడి వివరాలు, పనుల పరిస్థితిపై యాప్ లో వివరాలు నమోదు చేయగానే ఏఐ వాటిని పరిశీలిస్తుంది. ఉండాల్సిన నిబంధనలకు ఇంటి నిర్మాణం భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది. ఆ తరువాత అధికారులు మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తారు. ఇందులో అక్రమాలు తేలితే చర్యలు తీసుకోనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ పథకం కింద పలు ఇళ్లు నిర్మాణాలకు సంబంధించి పునాదులు పూర్తయ్యాయంటూ మొదటి విడత బిల్లుల కోసం ఆన్ లైన్ లో వివరాలు, ఫొటోలు నమోదు చేశారు. అయితే, వివరాల్లో తేడాలున్నట్లు ఏఐ గుర్తించింది. అధికారులు పరిశీలించగా.. ఆ ఇళ్లకు పునాదులు పూర్తికాలేదని తేలింది. దీంతో ఆన్ లైన్ లో తప్పుడు ఫొటోలను అప్ లోడ్ చేసిన బిల్ కలెక్టర్ పై వేటుపడింది. అదేవిధంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ ఏఐ సాంకేతికను వినియోగిస్తుండటంతో ఏ మాత్రం చిన్నతప్పు జరిగినా సదరు అధికారులతోపాటు లబ్ధిదారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంకు సంబంధించిన ప్రభుత్వం నిబంధనల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఏఐ పసిగట్టేస్తోంది.
యాప్ లో ఏఐ సాంకేతికతతో గుర్తించేవి ఇవే..
♦ లబ్ధిదారుల ముఖ కవళికలు
♦ ఇంటి స్వరూపం – ఆర్సీసీ/ఏసీ షీట్ / తాటాకులు/ ప్లాస్టిక్ షీట్ రూఫ్.
♦ ఇళ్లు నిర్మించాల్సిన స్థలం ఆక్షాంశ. రేఖాంశాలు
♦ ఇళ్ల నిర్మాణ దశల ఫొటోలు
♦ లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా వివరాలు