ఏపీలో జగన్‌కు షర్మిల తరహాలోనే ఇక్కడ కేటీఆర్‌కు కవిత తయారయ్యారు.. ఎందుకంటే?: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
కవిత, హరీశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

బీఆర్ఎస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. పది మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే బీఆర్ఎస్ ఎల్పీ చీలిపోతుందని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్ రావు సహకారంతో బీఆర్ఎస్‌లో చీలిక రానుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు షర్మిల తరహాలోనే ఇక్కడ కేటీఆర్‌కు కవిత తయారయ్యారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సొంత ఎజెండా పెట్టుకుని పని చేయకూడదని కేటీఆర్ చెప్పడం ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, స్పీకర్ సాయం కూడా ఇందుకు అవసరమని మహేశ్వర్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు, కవితకు సహకరించేందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని ఆరోపించారు.
తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు మధ్య విభేదాలు ఉన్నాయని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. రజతోత్సవ సభలో కేటీఆర్‌దే పెత్తనమని.. కవిత, హరీశ్ రావుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని అన్నారు. హరీశ్, కవిత డమ్మీగా మిగిలారని చెప్పారు. పలు కారణాలతో కేసీఆర్ క్రియాశీలకంగా ఉండటం లేదని తెలిపారు. సభలో కూడా అంత యాక్టివ్‌గా లేరని అన్నారు.
తన తరువాత బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ అని పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. డీఫాల్ట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారని, కేసీఆర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వ్యాఖ్యానించారు. సభలో తండ్రీకొడుకులు కీలకంగా వ్యవహరించారని, కవిత, హరీశ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
కవిత ఒంటరి అయ్యారని, ఆదిపత్య పోరు తారస్థాయికి చేరిందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. మహిళా సమానత, సామాజిక తెలంగాణ సాధన అంశంలో బీఆర్ఎస్ విఫలమైందని కవిత అన్న వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనని అన్నారు. పదవులు, ఆస్తులు అన్ని కేటీఆర్‌కేనా అంటే లేఖాస్త్రంలో కవిత తిరుగుబాటు చేశారని తెలిపారు.
కవిత కేసీఆర్ పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కు రాసిన లేఖ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని అన్నారు. కేటీఆర్‌కే అన్ని ఇస్తుండటంతో కవిత తిరుగుబాటు జెండా ఎగురవేశారని చెప్పారు. తనను రాజకీయంగా అణిచి వేసేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
మేడే రోజున తండ్రి పాలనా వైఫల్యాలు ఎండగట్టారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని చెప్పడం ఆమెలోని ఆవేదన బయటపడిందని అన్నారు. బీఆర్ఎస్‌లో ఒకే పవర్ సెంటర్ ఉండాలని కేటీఆర్ అభిమతమని అన్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేసిన వెంటనే హరీశ్ రావు మీడియా సమావేశం పెట్టడం వెనక కేసీఆర్ హస్తం ఉందని చెప్పారు.
పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ అయితే ఎల్పీ నేత అవకాశం తనకు ఇవ్వాలని హరీశ్ రావు కండీషన్ పెట్టారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. పదిమందిని తీసుకుని వేస్తే ఎల్పీ నేత అవకాశం ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆరోపించారు. అందుకే హరీశ్ రావు దగ్గరికి కేటీఆర్ వచ్చి చర్చించారని అన్నారు. ఎల్పీతో పాటు అధ్యక్షుడిగా కూడా తానే ఉంటానని కేటీఆర్ చెప్పారని తెలిపారు. హరీశ్ రావు ఆలోచనలు మారిపోయాయని అన్నారు.
ముందు వెళ్లిన పది మందికి తోడు మరో పదిమందిని తీసుకుని వస్తే ఎల్పీ నేత చేస్తానని హరీశ్‌కి రేవంత్ రెడ్డి చెప్పారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇదే జరిగితే కొంప మునుగుతుందని కేటీఆర్ భయపడ్డారని అన్నారు. హరీశ్ వెంట 13 మంది, కవితతో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడిన పది మందిని కలుపుకుంటే మొత్తం 27 మంది అవుతారని, ఎల్పీ నేతను చేయడానికి సహకరిస్తానని హరీశ్‌తో సీఎం అన్నారని ఆరోపించారు.