రోడ్డు మీద పడి ఉన్న 3 రోజుల పసిగుడ్డును చేరదీస్తే 13 ఏళ్లు అయ్యాక.. ఆ తల్లినే చంపేసిన బాలిక.. ఇద్దరు కుర్రాళ్ల వలలో పడి..
ఆ ఎనిమిదో తరగతి అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇద్దరు యువకులతో సన్నిహిత సంబంధం పెట్టుకుంది.

Representative image
రాజ్యలక్ష్మి కర్ అనే ఓ మహిళకు 13 ఏళ్ల క్రితం రోడ్డుపై ఓ ఆడ శిశువు కనపడింది. ఆ మహిళ హృదయం ద్రవించిపోయింది. ఆ పాపను తన ఇంటికి తీసుకెళ్లి అల్లారుముద్దుగా, ఏ కష్టమూ రాకుండా పెంచింది. ఆ పాపను ఇంటికి తెచ్చుకున్న సంవత్సరం తర్వాత రాజ్యలక్ష్మి భర్త మృతి చెందాడు.
ఆ తర్వాత ఆ పాపను మరింత బాగా చూసుకుంది. ఇప్పుడు ఆ పాపకు 13 ఏళ్లు వచ్చాయి. ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూడా వద్దనుకుని రోడ్డుపై పడేసిన తనను పెంచిన రాజ్యలక్ష్మి కర్‌ను దారుణంగా చంపేసింది ఆ అమ్మాయి.
Also, Read: దేశద్రోహులు..! భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం.. లేడీ యూట్యూబర్ సహా ఆరుగురు అరెస్ట్..
ఈ దారుణ ఘటన ఒడిశా, గజపతి జిల్లాలోని పర్లాఖేమిడి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి మరో ఇద్దరు యువకులతో కలిసి ఏప్రిల్ 29న తన పెంపుడు తల్లి రాజ్యలక్ష్మి కర్ (54)ను హత్య చేయడానికి కుట్ర పన్నింది.
ఎందుకు చంపింది?
ఆ ఎనిమిదో తరగతి అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇద్దరు యువకులతో సన్నిహిత సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె పెంపుడు తల్లి రాజలక్ష్మి ఇటువంటి పనులు చేయకూడదని బుద్ధి చెప్పింది. అయినప్పటికీ ఆ అమ్మాయి వినలేదు. రాజ్యలక్ష్మి అడ్డును తొలగించుకుంటే తనకు ఇష్టం వచ్చినట్లు బతికేయవచ్చని అనుకుంది. అంతేగాక, రాజ్యలక్ష్మి ఆస్తిని కూడా కాజేయాలన్న ఆలోచనలు ఆ అమ్మాయికి వచ్చాయి.
తనను పెంచి పెద్ద చేసిన రాజలక్ష్మికి ఆ అమ్మాయి ఏప్రిల్ 29న నిద్రమాత్రలు ఇచ్చి, తరువాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి దిండులతో ఆమెకు ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని భువనేశ్వర్‌లో ఆమె బంధువుల సమక్షంలో దహనం చేశారు. ఆమె గుండెపోటుతో మరణించిందని బంధువులు అందరూ అనుకున్నారు.
చివరకు రాజ్యలక్ష్మి సోదరుడు శివ ప్రసాద్ మిశ్రా భువనేశ్వర్‌లో బాలిక మొబైల్ ఫోన్‌ను చూశాడు. ఆ బాలిక కొన్ని రోజులుగా ఆ ఫోన్‌ను వాడలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను శివ ప్రసాద్ మిశ్రా పరిశీలించాడు. రాజ్యలక్ష్మిని చంపేందుకు ఆ బాలిక హత్య ప్లాన్ గురించి తన ఇద్దరు స్నేహితులతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేసిందని శివ ప్రసాద్ గుర్తించాడు.
రాజలక్ష్మిని చంపి ఆమె బంగారు ఆభరణాలు, నగదును తీసుకున్నట్లు కూడా చాట్‌ల ద్వారా అతడికి తెలిసింది. దీంతో అతడు దీనిపై మే 14న పర్లాఖేమిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు జరిపి ఆ టీనేజ్ అమ్మాయి, ఆమె స్నేహితులు ఆలయ పూజారి గణేశ్ రత్ (21), దినేశ్ సాహు (20)ని అరెస్టు చేశారు.