Bhatti Vikramarka Mallu (Photo : Twitter)
Bhatti Vikramarka Mallu – Uttam Kumar Reddy : నల్లగొండ పార్లమెంటు సభ్యుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారన్నది కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కుట్రదారులు చేస్తున్న అసత్య ప్రచారం అని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇది బీర్ఎస్-బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అని ఆరోపించారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తున్నాయని ధ్వజమెత్తారు.
Also Read..Etala Rajender : బీజేపీలో ఈటల మౌనం, అనుచరులతో సమావేశం.. పార్టీ మారతారంటూ ప్రచారం
పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేనటువంటి వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వార్తలను బాధ్యత కలిగిన మీడియా సంస్థలు ప్రసారం చేయడం దురదృష్టకరం అని భట్టి విక్రమార్క వాపోయారు. పార్టీ అధ్యక్షుడిగా ఏడేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కాపాడిన నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అని భట్టి విక్రమార్క అన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలపై ఆయన సీరియస్ అయ్యారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు హల్ చల్ చేయడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉత్తమ్ తేల్చి చెప్పారు. కావాలనే కొందరు వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తన గురించి ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటాను అని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆయనకు ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. భార్య పద్మావతితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి.