Bhatti Vikramarka Mallu : బీఆర్ఎస్‌లో ఉండేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు- భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

వాళ్ళు పెట్టిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఇంత దారుణంగా దిగజారుతారనుకోలేదు.

Bhatti Vikramarka Mallu Slams Ktr

Bhatti Vikramarka Mallu : ఖమ్మం డీసీసీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నడుస్తోందని.. ఆ మీటింగ్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో క్లారిటీ వస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే మీము ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. ప్రజల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాపై ఉందన్నారు.

”మీము ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదు. అసలు బీఆర్ఎస్ లో ఉండటానికి ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు. ఎప్పుడెప్పుడు మా పార్టీలో చేరాలనే ఉత్సహంతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 13 స్థానాలు గెలుచుకుంటాం. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వమే. గత వర్షా కాలంలో నీటిని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఈ వర్షాకాలం నుంచి మీము ముందు చూపుతో వ్యవహరించి వచ్చే ఏడాది వేసవిలో కరువు లేకుండా చూసుకుంటాం. నీళ్లను కూడా గత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి భయం లేకుండా ప్రజలు బతుకుతున్నారు. గత ప్రభుత్వం ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలుసు. మూడు నెలల్లో యువతకు 30వేల ఉద్యోగాలు కల్పించాం.

పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా యువత నడుం బిగించి కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయి. చాలామంది నాయకులు వారి స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతూన్నారు. వాళ్ళు పెట్టిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఇంత దారుణంగా దిగజారుతారనుకోలేదు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం ఉద్ధరించారు? ప్రభుత్వాన్ని నడపాల్సిన రీతిలో నడపలేదు.

గతంలోలా కాకుండా అన్ని శాఖలను ఒకాయనే రివ్యూ చేసినట్లు మేము చేయలేదు. మా ప్రభుత్వంలో మంత్రులందరూ ఎవరికి వారు వారి శాఖలను రివ్యూ చేస్తు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారు. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే. మేము ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర అవసరాల నిమిత్తం ఏదో ఒక పని చేయించుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రమంత్రి గడ్కరీ రీజనల్ రింగ్ రోడ్డుకు క్లియరెన్స్ తీసుకొచ్చాం. కావాల్సిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒప్పించి తీసుకొచ్చాం. మీలా ఢిల్లీ వెళ్లి ఇతర రాష్ట్రాల నేతలతో సమావేశం అవుతూ దేశ్ కి నేత కావాలనుకోలేదు” అని భట్టి విక్రమార్క అన్నారు.

దేశ భద్రతకే ప్రమాదం తెచ్చారు- భట్టి విక్రమార్క
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారని, ఇప్పుడు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. దేశ భద్రతకే ప్రమాదం తీసుకొచ్చారని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన భట్టి.. ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ దే బాధ్యత అన్నారు.

Also Read : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?