Peddapalli Lok Sabha Constituency : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?

ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో... ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు... ఈ సారి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Peddapalli Lok Sabha Constituency : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?

Peddapalli Lok Sabha Constituency

Peddapalli Lok Sabha Constituency : తెలంగాణలో లోక్‌సభ సమరం ఆసక్తికరంగా మారుతోంది. కాకా ప్యామిలీకి కంచుకోటైన పెద్దపల్లి నియోజకవర్గంలో గత రెండుసార్లు కారు జోరు చూపింది. ఐతే ఈ సారి కారుకు బ్రేక్‌లు వేసేలా కాకా మనవడినే రంగంలోకి దింపింది హస్తం పార్టీ. అటు బీఆర్‌ఎస్‌ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పోటీకి పెట్టగా బీజేపీ గోమాస శ్రీనివాస్‌ను బరిలోకి దింపడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఎలాగైనా హస్తం జెండా ఎగరేసి పూర్వవైభవం చాటాలనే కసితో కాంగ్రెస్‌ పనిచేస్తుండగా, అధికార పార్టీకి దీటుగా బీఆర్‌ఎస్‌.. మరోవైపు బీజేపీ కూడా వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.

సింగరేణి కార్మికుల ప్రభావం ఎక్కువ..
తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంట్‌ సీటుదో ప్రత్యేకత.. సింగరేణి కార్మికులు ప్రభావం ఎక్కువగా ఉండే ఈ పార్లమెంట్‌ సెగ్మంట్‌లో గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌దే హవా. ఐతే పదేళ్ల క్రితం వరకు తమ కంచుకోటగా ఉన్న పెద్దపల్లిని ఈ సారి భారీ విక్టరీతో తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌.. మరోవైపు బీజేపీ కూడా ప్రధాని మోదీ చరిష్మాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు ఎత్తులు.. పై ఎత్తులతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి.

కాంగ్రెస్ క్లీన్ స్వీప్..
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో రామగుండం, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ధర్మపురి నియెజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15 లక్షల 94 వేల 392 ఓట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఏడు నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం ఏడు చోట్ల కలిపి 6 లక్షల 82 వేల 33 ఓట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది కాంగ్రెస్‌. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి 3 లక్షల 36 వేల 374 ఓట్లు వచ్చాయి. గతంలో బీఆర్‌ఎస్‌ హవా కొనసాగిన పెద్దపల్లిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి రివర్స్‌ ఫలితాలు వచ్చాయి. ఇక ఈ సారి ఎలాగైనా గెలవాలని కలలు కంటున్న బీజేపీకి ఏడు నియోజకవర్గాల పరిధిలో కేవలం 79 వేల 418 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మార్పుపైనే బీఆర్ఎస్, బీజేపీ ఆశలు..
అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్‌ ఏకపక్ష విజయాలు సాధించగా, పార్లమెంట్‌ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు వచ్చిందనే ఆశతో ప్రతిపక్ష పార్టీలు పోటీకి రెడీ అవుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌లో చేరగా.. సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌. ఇక ఎప్పటి నుంచో ఎంపీ కావాలని కలలు కంటున్న గోమాశ శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది బీజేపీ. ఈ రెండు పార్టీలకు దీటుగా ఆర్థిక బలం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కాకా మనవడు గడ్డం వంశీకి టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్.

ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దపల్లిలో గెలవాలని టార్గెట్‌..
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ పరిశ్రమలు ఉన్నాయి. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులే గెలుపోటములను డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం పార్లమెంట్ పరిధిలో 7 నియెజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో ఆ పార్టీలో గెలుపు ధీమా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ దూకుడుకు కళ్లెం వేయాలని బీఆర్‌ఎస్‌ పక్కా స్కెచ్‌ వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దపల్లిలో గెలవాలనే టార్గెట్‌తో సీనియర్‌ నేత కొప్పుల ఈశ్వర్‌కు టికెట్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొప్పుల.. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు.

ఆ పరిచయాలే గెలిపిస్తాయని ధీమా..
సింగరేణి మాజీ కార్మికుడైన కొప్పులకు ఈ ప్రాంతంలో బంధువర్గం, స్నేహితులు, అనుచరులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మేడారం నియెజకవర్గంలో భాగమైన రామగుండం, ధర్మపురి నియెజకవర్గాల్లో కొప్పులకు అభిమానులు ఉన్నారు. దీనికి తోడు కోల్‌బెల్ట్ వ్యాప్తంగా కారు పార్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉండటంతో గెలుపుపై ఆశలు పెట్టుకుంటోంది బీఆర్‌ఎస్‌. తనకున్న విస్తృత పరిచయాలే ఎంపీగా గెలిపిస్తాయని కొప్పుల ఈశ్వర్‌ కూడా నమ్మకంగా చెబుతున్నారు.

తాత రాజకీయ వారసత్వం..
ఇక ఏడు నియెజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలంతో.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామంటున్నారు హస్తం అభ్యర్థి గడ్డం వంశీ. బలమైన ఆర్థిక నేపథ్యం, గణమైన కుటుంబ రాజకీయ వారసత్వంతో వంశీకి టికెట్‌ ఖరారు చేసిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగిస్తామంటోంది. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ తనయుడైన గడ్డం వంశీ తన తాత, దివంగత నేత, కాకా వెంకటస్వామి రాజకీయ వారసత్వానికి తోడుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందనే ప్రచారం చేసుకుంటున్నారు. తన తాత, తండ్రి ఇద్దరూ ఎంపీలుగా పనిచేయడం, అప్పట్లో వారు తెచ్చిన పథకాలు, నిధులతోనే పెద్దపల్లిపై స్పష్టమైన ముద్రవేశారని, తాను ప్రచారానికి వెళితే.. నాటి సంగతులనే ప్రజలు గుర్తు చేస్తున్నారని చెబుతున్నారు వంశీ.

ఆ ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తుందని బీజేపీ అభ్యర్థి ధీమా…
నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు సింగరేణిలో ఆ పార్టీ అనుబంధ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవడం కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న గోమాస శ్రీనివాస్ చీల్చే ఓట్లు కూడా కీలకంగా మారాయి. 1993 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గోమాస శ్రీనివాస్.. 2009లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 2 లక్షల 64 వేల 731 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన గోమాస.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు టికెట్‌ దక్కలేదనే అసంతృప్తితో ఈ మధ్యే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 15 లక్షల 94 వేల 392 ఓట్లు ఉండగా… అందులో గోమాస శ్రీనివాస్‌ సామాజికవర్గమైన మహవీర్ నేతకాని సామాజికవర్గానికి 2 లక్షల 25 వేల 875 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోమాస శ్రీనివాస్.

ఈసారి తీర్పు ఎలా ఉంటుందో?
మొత్తానికి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నా అభ్యర్థులు తమ సామాజికవర్గ ఓట్లతో పాటుగా.. ఇతర వర్గాల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థులు నేతకాని, మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో… ఇందులో మాదిగ సామాజికవర్గం ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తి కరంగా మారింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు… ఈ సారి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Also Read : తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్ దూకుడు.. కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్