Bhu Bharati: ఇక వాళ్ల ఆటలు సాగవ్..! వారసత్వ బదిలీ, వీలునామా హక్కుల బదిలీకి భూభారతి చట్టంలో కీలక నిబంధనలు..

గతంలో వారసత్వ, వీలునామా హక్కుల బదిలీ ఏకకాలంలో పూర్తయ్యేది. భూ భారతి చట్టంలో మాత్రం హక్కుల బదిలీకి గడువును నిర్ణయించారు.

Bhubharati rules

Bhu Bharati: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. నారాయణపేట జిల్లా మద్దూరు, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో ప్రయోగాత్మకంగా పోర్టల్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చట్టాన్ని ఆవిష్కరించగా.. ఆ వెంటనే ఆర్వోఆర్ -2020, ధరణిల స్థానంలో ఆర్వోఆర్-2025 భూభారతి, భూ- భారతి పోర్టల్ లను అమల్లోకి తెస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చట్టం నిబంధనలు, సేవలు, అధికారుల పరిధి, ఫీజుల వివరాలను అందులో పేర్కొంది.

Also Read: Bhu Bharati: భూభారతి రూల్స్ ఇవే.. మీ భూ రికార్డుల్లో తప్పులుంటే ఏం చేయాలి..? పూర్తి వివరాలు ఇలా..

భూభారతి అమల్లో భాగంగా ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒక స్థాయిలో కాకపోయినా రెండో స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇక అప్పీళ్లు మాత్రమే కాకుండా ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటును మార్గదర్శకాల్లో వెల్లడించారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. గతంలో విధంగా కాకుండా వారసత్వ బదిలీ, వీలునామా హక్కుల బదిలీకి సంబంధించి భూభారతి చట్టంలో కీలక నిబంధనలు పొందుపర్చారు.

 

గతంలో ధరణి ఉన్న సమయంలో విచారణ లేకుండానే వారసత్వ, వీలునామా హక్కుల బదిలీ ఏకకాలంలో పూర్తయ్యేది. దీంతో కొందరు కుటుంబ సభ్యులు తమకు తెలియకుండానే మ్యూటేషన్ చేశారంటూ ఫిర్యాదులు చేసేవారు. అయితే, భూభారతి చట్టంలో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిబంధనలు పొందుపర్చారు.

 

భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇకనుంచి వారసత్వ, వీలునామా హక్కుల బదిలీకి సంబంధించి విచారణ తప్పనిసరి చేశారు. వారసత్వ లేదా వీలునామాకు సంబంధించిన స్లాట్ నమోదై, సంబంధిత వివరాలు భూ భారతి పోర్టల్లో తహసీల్దారు లేదా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కు చేరగానే ఆ అధికారి నోటీసులు జారీ చేస్తారు. 30రోజుల లోపు విచారణ ముగించి, వారసత్వ, వీలునామా ప్రక్రియను పూర్తిచేసి హక్కుల రికార్డులో (ఆర్వోఆర్) భూ యాజమాని పేరుమార్పిడి చేస్తారు. నిర్ణీత గడువులోపు తహసీల్దారు మ్యూటేషన్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఈ ప్రక్రియ పూర్తయినట్లే పరిగణిస్తారు. పాత పాసుపుస్తకం ఉంటే సంబంధిత వివరాలను అందులో నమోదు చేస్తారు. లేదా కొత్త పాస్ బుక్ జారీ చేస్తారు. అయితే, దరఖాస్తుదారు వారసుల ఒప్పందం, వీలునామా పత్రం, భూమి సర్వే పటం జత చేయాల్సి ఉంటుంది.

 

భూ భారతి చట్టంలో నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇలా..
◊ రిజిస్ట్రేషన్ ఫీజు : రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ ప్రకారం.
◊ మ్యూటేషన్/వారసత్వ బదిలీ : ఎకరాకు రూ.2500, గుంటకు రూ.62.50.
◊ పాసు పుస్తకం జారీ : రూ.300
◊ తప్పుల సవరణకు : రూ.1,000
◊ అప్పీళ్లకు : రూ.1,000
◊ ధ్రువీకరించిన పత్రాలకు: రూ.10
◊ స్లాట్‌ మార్పులకు: మొదట ఉచితం, రెండోసారి రూ.500, మూడోసారి రూ.1,000 (ఆరు నెలలలోపు వరకు యథాతథం)

Also Read: Gold Rate Today: బంగారం ధరల్లో భారీ మార్పులు.. యూటర్న్ తీసుకున్న గోల్డ్.. హైదరాబాద్ లో తులం రేటు ఎంతంటే?