Site icon 10TV Telugu

హైదరాబాద్‌‌‌ వాసులకు బిగ్‌అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం.. ఉద్యోగులు త్వరగా ఇళ్లకు చేరుకోండి.. బయటకు రావొద్దు..

Hyderabad Rains: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో వచ్చే నాలుగు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. హైదరాబాద్ నగర వాసులను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్లో వర్షాలపై తాజాగా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళల్లో వర్షం దంచికొడుతుంది. సోమవారం కూడా వర్షం పడింది. నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. అయితే, మంగళవారం సాయంత్రం కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తొరగా ఇళ్లకు వెళ్లండి..
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచన చేసింది.. ఉద్యోగులను త్వరగా కార్యాలయాల నుంచి పంపించివేయడంతోపాటు.. సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలంటూ ఆయా కంపెనీలకు సూచించింది.. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అడ్వైజరీ జారీ చేసింది. సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో ఆయా కంపెనీలు ఉద్యోగులకు 3 గంటల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా. తొందరగా లాగ్ అవుట్ అవకాశం ఇవ్వాలని, అలాగే.. సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారికి ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరింది. అలా చేయడం వల్ల భద్రత తోపాటు, ట్రాఫిక్ కష్టాలు ఉండవని, ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదని పేర్కొంది.


నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు..
తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్టు ప్రకారం.. హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో ఇవాళ సాయంత్రం వరకు మోస్తరు వర్షం పడుతుందని, సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగస్టు 13వ తేదీ (బుధవారం), 14వ తేదీ (గురువారం) భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గురువారం కొన్ని ప్రాంతాల్లో 70 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 15వ తేదీ కూడా పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.

Exit mobile version