గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి.. స్కామ్‌లు చేసేవారికే దిమ్మతిరిగే స్కామ్ ఇది

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల సిత్రాలు అన్నీఇన్నీ కావు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది.

Big Scam in Sheep Distribution : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల సిత్రాలు అన్నీఇన్నీ కావు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. బైక్, కారు, బస్సు, అంబులెన్స్‌లో గొర్రెల రవాణా చేయడంతోపాటు గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు తేల్చింది. దీనికితోడు చనిపోయిన వారికీ గొర్రెలను పంపిణీ చేసినట్లు నమోదు చేయడంతో పాటు.. నకిలీ రవాణా ఇన్వాయిస్‌లతో 68 కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగ్‌లతో మరో 92 కోట్ల అవినీతి జరిగిందని, గొర్రెల పంపిణీలో 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Also Read : CM Revanth Reddy: రాబోయే పదేళ్లు సీఎం పదవిలోనే ఉంటాను.. ఎందుకంటే?: రేవంత్ రెడ్డి

తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది. 2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్‌గా అందజేశారు. ఒక యూనిట్‌ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా అందులో 75 శాతం 93,750 రాయితీ ఇచ్చారు. 25 శాతం మేర 31250 లబ్ధిదారుడు చెల్లించాడు. ఈ పథకం కింద 2017-18, 2018-19 సంవత్సరాల్లో రెండేళ్ల వ్యవధిలో 5వేల కోట్ల వ్యయంతో 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2021 డిసెంబరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.32 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గొర్రెల పంపిణి పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేధిక తేల్చింది. అసెంబ్లీలో గొర్రెల పంపిణీలోని అక్రమాలపై కాగ్ నివేధిక ప్రవేశపెట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : వెయ్యి కోట్లకు పైగా ప్రజాధ‌నం దుర్వినియోగం..! కాగ్ రిపోర్టులో సంచలనం

అంబులెన్స్ లలో గొర్రెల తరలింపు..
గొర్రెలను సాధారణంగా ట్రాలీతో ఉన్న వాహనంలో తరలిస్తారు. కానీ, తెలంగాణలో మాత్రం గొర్రెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కారు, బస్సు, అంబులెన్స్‌లోనూ తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో గొర్రెల పంపిణీపై విచారణ జరిపిన కాగ్ నమ్మలేని నిజాలను వెలికితీసింది. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని తేల్చింది. జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు, చనిపోయిన వారికీ కూడా గొర్రెలను పంపిణీ చేసినట్లు కాగ్ గుర్తించింది. అందులో ప్రధానంగా నకిలీ రవాణా ఇన్వాయిస్‌లతో 68 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో ఒక బైకుపై ఒకేసారి ఏకంగా 126 గొర్రెలను తరలించినట్లు ఇన్వాయిస్ లను గుర్తించింది. బైకుపైనే కాదు.. కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్‌లో కూడా గొర్రెలను తరలించినట్లు రికార్డుల్లో చూపడాన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబరు వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి వందల కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నివేధికలో పేర్కొంది.

Also Read : ఎలక్టోరల్ బాండ్ల పథకం ఎవరు ప్రవేశపెట్టారు.. సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది?

గొర్రెలకు నకిలీ ట్యాగ్‌లతో 92 కోట్లు స్వాహా ..
గొర్రెల గొనుగోలకు సంబందించిన నకిలీ ఇన్వాయిస్ ల మీద చెల్లింపులు, కొన్న గొర్రెలనే మళ్లీ మళ్లీ కొనడం, అవే గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వడం, క్షేత్ర స్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవేనని కాగ్ నివేధిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగ్‌లతో 92 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ పరిశీనలో తేలింది. మొత్తం 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది. ఏడు జిల్లాల్లో సుమారు 860 మంది చనిపోయిన రైతులు పేర్లతోను గొర్రెలను పంపిణీ చేశామని చెప్పి డబ్బులు దండుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయిదు జిల్లాల పరిధిలో 96,299 గొర్రెల యూనిట్లు సరఫరా చేసినట్లు నివేదికల్లో చూపినా.. వాస్తవానికి 29,616 యూనిట్లు మాత్రమే పంపిణీ జరిగినట్లు కాగ్‌ ఆడిట్‌లో వెలుగుచూసింది. ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని కాగ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్‌ కేసులను పెట్టాలని, మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలని సూచించింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు