Pallavi Prashanth
Pallavi Prashanth Arrested : బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట గజ్వేల్ మండలం కొల్లూరులో అతని నివాసం వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి ఆరు గంటలపాటు విచారించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమంటూ పోలీసులు హెచ్చరించారు. బుధవారం రాత్రి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని జడ్జి ఇంట్లో హాజరుపర్చారు. ఈ క్రమంలో న్యాయమూర్తి పల్లవి ప్రశాంత్ కు 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు ప్రశాంత్ ను పోలీసులు తరలించారు. ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడికి రిమాండ్ విధించారు.
Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్
ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనపై పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తదితరులపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, అతని కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను అరెస్టు చేశామని అన్నారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీరాన్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రశాంత్ ను మెజిస్టేట్ ముందు హాజరుపర్చగా.. 14రోజులు రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు. ఈ కేసుపై విచారణ జరుగుతుందని తెలిపారు.
గత ఆదివారం రాత్రి బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఫినాలే జరిగింది. ఈ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు. అయితే.. ఫైనల్ పూర్తి చేసుకొని హౌస్ నుంచి కంటెస్టెంట్స్ బయటకు వస్తుంటే కొందరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, అశ్విని, గీతూ, హర్ష, భోలే.. కార్లుపై దాడిచేశారు. అంతేకాక.. ఆర్టీసీ బస్సులపైనా రాళ్లదాడి చేశారు. దీంతో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగిలాయి.
ఇదిలాఉంటే.. కప్ తీసుకున్న తరువాత పోలీసుల సూచనల మేరకు చాలాసేపు బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచింది. ఆ తరువాత ఆయన్ను గేటు వెనుక నుంచి బయటకు పంపించేశారు. కానీ, ప్రశాంత్ మాత్రం మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తన కారులో వచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఆయనకోసం ఎదరుచూస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుచెప్పడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రశాంత్ తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. బుధవారం రాత్రి ప్రశాంత్ తో పాటు పలువురిని అరెస్టు చేశారు.