bjp cbi: మరికొన్ని రోజుల్లో దుబ్బాక ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఇంతలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆ డబ్బులు బీజేపీవేనని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులే తెచ్చి పెట్టారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ను కలిసిన బీజేపీ నేతలు, దుబ్బాక అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అడ్డంగా దొరికిపోయినా బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులు బీజేపీవే అని హరీష్ రావు ఆరోపించారు.
https://10tv.in/dubbaka-bypolls-effect-on-all-parties/
బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో రూ.18లక్షల నగదు:
సిద్దిపేటలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు సురభి అంజన్‌రావు ఇంట్లో నిన్న(అక్టోబర్ 26,2020) పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారు. ఏకంగా రూ.18.67 లక్షల నగదు లభ్యమైంది. ఈ వ్యవహారం సంచలనం రేపింది. సీజ్ చేసిన నగదుతో పోలీసులు బయటకు వస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులే ఇంట్లో డబ్బులు పెట్టి.. లభ్యమైనట్లు చెబుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. కొందరు కార్యకర్తలు పోలీసుల చేతిలో ఉన్న డబ్బుని లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.