Eatala Rajender: నిధులన్ని ఆ మూడు నియోజకవర్గాలకేనా..! సిద్ధిపేట మంత్రి వస్తావా చర్చకు?

బీజేపీ మేనిఫెస్టో అందరికంటే మెరుగ్గా ఉంటుంది. కేసీఆర్ మాటలకు అగం కావద్దు.. ఈ సారి అగం కావాల్సింది కేసీఆర్, అగం చేయాల్సింది మనం అంటూ ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Eatala Rajender and Harish Rao

BJP MLA Eatala Rajender: బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా పాటించమని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. పదవుల కోసం పార్టీ మారారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రులు నిధులకు ఓనర్లు కాదు.. కాపలాదారు మాత్రమేనని, దేశంలోనే తెలంగాణ ధనవంతమై‌న రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్.. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఈటల ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఎందుకు ఇంతవరకు చేయలేదు? కేసీఆర్ రింగ్ రోడ్డు‌ను అమ్ముకున్నడు.. పైసలు లేక మూడు నెలలు ముందే లిక్కర్ టెండర్లు పెట్టారు.. అన్నీ జమచేసినా రైతులకు రుణమాఫీ పైసలు వచ్చాయా? అంటూ ఈటల అన్నారు.

Read Also : Harish Rao Thanneeru : మీ గ్యారెంటీలు దేవుడెరుగు, మీకస‌లు ఓట్లు ప‌డ‌తాయా? తెలంగాణ ఎవ‌రి ద‌య‌తోనో రాలేదు- కాంగ్రెస్ అగ్రనేతలపై మంత్రి హరీశ్ రావు ఫైర్

తెలంగాణ ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్.. కోకాపేట భూములు అమ్ముకుంటే తప్ప జీతాలు, పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి అంటూ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేను కొత్తగా ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు లిక్కర్ ద్వారా ఆదాయం 10 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు 45 వేల కోట్లకు చేరింది. అర్థరాత్రి పూట ఊర్లలో మంచినీళ్లు దొరకవుకానీ మద్యం మాత్రం దొరుకుతుంది. రాష్ట్రంలో మద్యం నిషేదశాఖ, మద్యం విక్రయశాఖగా మారిందంటూ ఈటల విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ కరెంట్ 24 గంటలు ఇస్తే ముక్కు నేలకు రాస్తా.. ఇచ్చేది ఎనిమిది, తొమ్మిది గంటలు.. దేశమంతా 24గంటలు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also :   Minister KTR : కాంగ్రెస్ కాలకేయుల పార్టీ.. రాబందుల రాజ్యం వస్తే రైతుబంధు రద్దవ్వడం ఖాయం : మంత్రి కేటీఆర్

నిధులన్నీ గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లకేనా..? రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల ప్రజలు పన్నులు కడతలేరా అంటూ ఈటల ప్రశ్నించారు. అంతా నీ సిద్దిపేటకే.. సిద్దిపేట మంత్రి వస్తావా చర్చకు అంటూ హరీశ్ రావును ఉద్దేశించి ఈటల సవాల్ చేశారు. నువ్వు రాష్ట్రానికి మంత్రివా? నియోజక వర్గానికా అంటూ ఈటల ప్రశ్నించారు. దుబ్బాకను దత్తత తీసుకుంటానన్న మంత్రి హరీశ్ రావు ఇక్కడ ఏం అభివృద్ధి చేశావో చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతు బంధు భూస్వాములకు వచ్చాయి తప్ప.. కౌలు రైతులు నిండా మునిగారు. 10లక్షల డబుల్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 2లక్షల 80వేలు మంజూరు చేసి లక్షా 35వేలు కట్టి, ఓ 35 వేలు మాత్రం ఇచ్చారంటూ ఈటల అన్నారు.

మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యత ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఘనత మోదీ దని అన్నారు. అయోధ్య లో రామాలయం కట్టిన ఘనత మోదీ దని ఈటల అన్నారు. బీజేపీ మేనిఫెస్టో అందరికంటే మెరుగ్గా ఉంటుంది. కేసీఆర్ మాటలకు అగం కావద్దు.. ఈ సారి అగం కావాల్సింది కేసీఆర్, అగం చేయాల్సింది మనం అంటూ ఈటల ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజల కోసం ఎలాంటి ఆందోళనలకైనా మేం ముందుంటాం.. కటువైన పంచాయతీలకు రఘునందన్ రావు, సౌమ్యమైన పంచాయతీలకు నేను ఉంటా అని ఈటల అన్నారు.