కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాక్యలు

మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు.

Pocharam Srinivas Reddy joined To Congress party : మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోచారం నివాసానికివెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. కొద్దిసేపు చర్చల అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడుకూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికిగల కారణాలను వివరించారు.

Also Read : అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

రైతుల సంక్షేమానికి మొదటి నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్ తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వంకూడా ప్రాధాన్యత ఇస్తుందని, వ్యవసాయం దడగ కాదు.. పండుగ చేయడమే మా ప్రాధాన్యత అని తెలిపారు. ఈ క్రమంలో రైతుల అభ్యున్నతిని కాంక్షించే పోచారం లాంటి వ్యక్తి తమతో ఉంటే బాగుంటుందని భావించామని, వారి సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చామని అన్నారు. పోచారం సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని, రైతుల మేలుకోసం తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో పోచారంనుసైతం భాగస్వామ్యం చేస్తామని రేవంత్ చెప్పారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేముందు లోకేశ్, టీడీపీ సభ్యుల ఉత్సాహం చూశారా.. వీడియో వైరల్

పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమంకోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతుల సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కొనియాడారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నానని అన్నారు. రైతుల సంక్షేమాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేస్తానని పోచారం పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు నాకు బాగా నచ్చాయి. పనిచేసే నాయకత్వాన్ని సమర్ధించేందుకే రేవంత్ కు మద్దతిస్తున్నాను. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే.. పోచారం ఇంటికి రేవంత్, పొంగులేటి వచ్చిన విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పోచారం నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోచారం ఇంటివద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  బాల్క సుమన్ తీరుపై పోచారంను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కో తీరుగా ఉంటుందని పోచారం అన్నారు. నేనుకూడా తెలుగుదేశం పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. తెలుగుదేశం పార్టీని వీడటానికి గల కారణాలను ఆనాడే చెప్పాను. అసలు చెప్పాలంటే.. నాది మొదట కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ కండువా కప్పుకునే రాజకీయాలను ప్రారంభించాను. ఆ తరువాత టీడీపీలో చేరి సుదీర్ఘకాలం పనిచేశాను. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం మంచిగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి యువకులు, మరో 20యేళ్లు పాలించే సత్తాఉన్న వ్యక్తి.. మా వయస్సు అయిపోయింది. మాలాంటి వాళ్లు రేవంత్ లాంటి యువకులకు మద్దతుగానిలవాల్సిన అవసరం ఉందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

 

 

AP Assembly Session 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు, పవన్, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం..

ట్రెండింగ్ వార్తలు