BRS List Final: ఆ నాలుగు నియోజకవర్గాల్లో కొత్త వారికి బీఆర్‌ఎస్ టిక్కెట్లు?

సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ప్రకటనకు ముందు, తర్వాతి పరిస్థితులను సర్వే నివేదికల ద్వారా తెప్పించుకున్నారు. ఈ సర్వేలు కూడా సీఎం ఖరారు చేసిన అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది.

BRS party first list final kcr decided not to change for assembly polls in Telangana

BRS Party List: ఎన్నికల కదన రంగంలో ఓ అడుగు ముందుకు వేసిన గులాబీ పార్టీ.. ఒకేసారి 115 మంది అభ్యర్థులను (BRS Candidates) ప్రకటించింది. ఆ తర్వాత పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు నిరసన గళం విప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకరించేది లేదని స్పష్టం చేస్తూ రాజకీయంగా తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే బీ ఫామ్ (Form B) ఇచ్చే వరకు తమకు అవకాశం వస్తుందనుకున్న వారికి గులాబీ బాస్ ఏం సంకేతాలు ఇచ్చారు? ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చవద్దన్న అభిప్రాయానికి ఆయన వచ్చారా? ముందుగా ప్రకటించిన అభ్యర్థులతోనే బీఆర్‌ఎస్ ఎన్నికలకు వెళ్తోందా? తెర వెనుక ఏం జరుగుతోంది?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నెల రోజుల క్రితమే ప్రకటించారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. (CM KCR) 119 నియోజకవర్గాలకు గాను 115 స్థానాలకు క్యాండిడేట్స్‌ను డిక్లేర్ చేశారాయన. అయితే 20 నుంచి 30 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పెద్దఎత్తున గళం విప్పుతున్నారు. రోజుకో నియోజకవర్గంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని ఆశావహులు పార్టీ అధినేత ముందుకు తమ అభిప్రాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది నేతలు పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆందోళనలు చేస్తుంటే.. మరి కొంతమంది బీ ఫాం ఇచ్చేవరకు టిక్కెట్ తమకే వస్తుందన్న ధీమాను అనుచరులతో వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం ఏడాది ముందుగానే మొదలైంది. కానీ పార్టీ అధినేత కేసిఆర్ మాత్రం ఎమ్మెల్యేలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారినే అభ్యర్థులుగా మరోసారి ఖరారు చేశారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. నాలుగు స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీకి అవకాశం వస్తుందని భావించిన నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ క్యాడర్‌తో ప్రత్యేకంగా నేతలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు అసమ్మతి నేతలు.

Also Read: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా, త్వరలో కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్..!

ఈ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ప్రకటనకు ముందు, తర్వాతి పరిస్థితులను సర్వే నివేదికల ద్వారా తెప్పించుకున్నారు. ఈ సర్వేలు కూడా సీఎం ఖరారు చేసిన అభ్యర్థులకు అనుకూలంగా వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులపై స్వల్ప వ్యతిరేకత ఉందన్న సమాచారం పార్టీ పెద్దలకు అందింది. దీంతో ఆ అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను ఏ నియోజకవర్గంలోనూ మార్చకుండా ఎన్నికల రంగంలో దింపాలని సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అత్యవసరమైతే తప్ప ఒకటి, రెండు స్థానాలకు మించి అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం లేదన్న స్పష్టమైన సంకేతాలను కూడా పార్టీ అధినేత కేసీఆర్ ఇస్తున్నట్లు సమాచారం.

Also Read: రేవంత్‌రెడ్డికి బ‌లం పెరిగిందా.. స్క్రీనింగ్ కమిటీలో చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి?

ఇక పెండింగ్‌లో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని నర్సాపూర్, జనగామ స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలని సీఎం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గోషామహల్, నాంపల్లి విషయంలోనే ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదని సమాచారం. అతి త్వరలోనే ఈ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.