Revanth Reddy: రేవంత్‌రెడ్డికి బ‌లం పెరిగిందా.. స్క్రీనింగ్ కమిటీలో చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి?

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీలో పైచేయి సాధించారన్న టాక్‌ నడుస్తోంది. మరి క‌మిటీలో బ‌లం పెంచుకున్న రేవంత్.. తన వర్గానికి అనుకున్న స్థాయిలో సీట్లు దక్కించుకుంటారా?

Revanth Reddy: రేవంత్‌రెడ్డికి బ‌లం పెరిగిందా.. స్క్రీనింగ్ కమిటీలో చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి?

Did Telangana PCC chief Revanth Reddy gain strength

Revanth Reddy Strength: తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నిన్నటి వరకు ఎన్నిక‌ల స్క్రీనింగ్ కమిటీలో ఒంట‌రిగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఆల్ ఆఫ్ స‌డెన్‌గా బ‌లం పెరిగిందా? క‌మిటీలో చోటు చేసుకున్న ప‌రిణామాలేంటి? దీని వ‌ల్ల రేవంత్‌కు మేలు జరగబోతోంది? తెర వెనుక ఏం జరుగుతోంది?

నేతి బీర‌కాయ‌లో నెయ్యి మాదిరిగానే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఏకతాటిపై ఉన్నారనడం కూడా. ఎప్పుడూ ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్యం ప్రదర్శించడానికి శ‌త‌విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. టీ కాంగ్రెస్‌లో ఎవ‌రెన్ని పైకి చెప్పినా.. పీసీసీ చీఫ్ రేవంత్ వ‌ర్సెస్ సీనియ‌ర్ లీడ‌ర్లు అనేది సుస్పష్టం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) మ‌ధ్య గ్యాప్ ఉంద‌నేది గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల టాక్‌. రేవంత్ ఒకరిని ప్రోత్సహిస్తే.. వ్యతిరేక శిబిరాన్ని సీనియర్ల టీమ్ వెనకేసుకొస్తుంది. ఇది చాలా కాలంగా జ‌రుగుతున్న త‌తంగం. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఎవ‌రి గ్రూప్‌లు వారి అనుచ‌రుల‌కు టిక్కెట్లు ఇప్పించుకోవ‌డం కోసం తీవ్రంగా పనిచేస్తుంటారు. ఈ సమయంలో ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీతో పాటు అన్ని వేదిక‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటారు వారు.

ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక‌లో అత్యంత కీల‌క‌మైనది ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీ. కేర‌ళ‌కు చెందిన ఎంపీ ముర‌ళీధ‌ర‌న్ నేతృత్వంలో ఈ క‌మిటీ వేసింది అధిష్టానం. ఇందులో స‌భ్యులుగా గుజ‌రాత్‌కు చెందిన జిగ్నేష్ మేవాని, (Jignesh Mevani) ఢిల్లీకి చెందిన బాబా సిద్ధిఖీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, (Manikrao Thakre) ముగ్గురు సహ ఇంచార్జీలతో పాటు తెలంగాణ‌కు చెందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డిని నియ‌మించారు. మిగ‌తా వారి సంగతి పక్కన పెడితే.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలు మాత్రమే ఉండటం.. వీరిలో భ‌ట్టి, ఉత్తమ్ ఇద్దరూ ఒక జ‌ట్టు వ్యక్తులు కాడంతో రేవంత్‌కు క‌ష్టాలే అనే టాక్ వినిపించింది. సీట్ల విషయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు రేవంత్ ఒకరికి సపోర్ట్ చేస్తే.. మిగతా ఇద్దరు సైడైతే ఇబ్బందులు తప్పవన్న పరిస్థితి తలెత్తింది.

Also Read: విమానంలో వచ్చి కారులో ఎందుకెళుతున్నారు.. మాణిక్ రావు ఠాక్రే ప్రయాణంపై ఆసక్తికర చర్చ!

కానీ.. అనూహ్యంగా ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరు సీనియర్ నేతలను నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మ‌ధుయాష్కీ గౌడ్‌కు (Madhu Goud Yaskhi) అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల ప్రాతినిధ్యం ఐదుకు చేరింది. ఏదైనా సీటు విషయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైతే మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అంటే ముగ్గురు ఎటువైపు సపోర్ట్ చేస్తే.. వారికే టికెట్ దక్కుతుంది. ఇప్పుడు కొత్తగా క‌మిటీలో చేరిన కోమటిరెడ్డితోపాటు మ‌ధుయాష్కీ ఇద్దరూ కూడా కూడా రేవంత్‌కు ఫుల్ స‌పోర్ట్‌గా ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ రేవంత్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. కొద్ది రోజులుగా పీసీసీ చీఫ్ టీమ్‌లో చేరిపోయారు. స్క్రీనింగ్ క‌మిటీలో భట్టి, ఉత్తమ్ ఒకవైపు ఉంటే.. రేవంత్, కోమటిరెడ్డి, మధుయాష్కీ మరోవైపు ఉండే అవకాశముంది.

Also Read: షర్మిలకు బిగ్ షాక్..? కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి చెక్..! కారణం అదేనా? షర్మిల ఏం చేయనున్నారు?

మొత్తం మీద పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఎన్నిక‌ల స్క్రీనింగ్ క‌మిటీలో పైచేయి సాధించారన్న టాక్‌ నడుస్తోంది. మరి క‌మిటీలో బ‌లం పెంచుకున్న రేవంత్.. తన వర్గానికి అనుకున్న స్థాయిలో సీట్లు దక్కించుకుంటారా ? లేదా? వేచి చూడాల్సిందే.