BRS party shadow plan to implement congress 6 guarantees in Telangana
BRS Party: ఆరు గ్యారెంటీలు.. 412 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను నీడలా వెంటాడి.. ఆ హామీలు అమలు కోసం పట్టుపట్టాలని నిర్ణయించింది గులాబీ పార్టీ.. పదేళ్లుగా అధికారంలో ఉన్న అనుభవంతో కాంగ్రెస్ సర్కార్ ఏ హామీ నుంచి తప్పుకునే అవకాశం లేకుండా పకడ్బందీ వ్యూహంతో ఒత్తిడి పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు.
ప్రభుత్వాన్ని నీడలా వెంటాడి..
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన కారు పార్టీ నేతలు.. తమకు అధికారం దూరం చేసిన కాంగ్రెస్‌కు చుక్కలు చూపేలా స్కెచ్ వేస్తున్నారు. ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రకు నూరుశాతం న్యాయం చేస్తూ.. మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ఆరు గ్యారెంటీలు, 412 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చి.. ఎన్నికల హామీలు అన్నీ అమలు చేసేలా బాధ్యత తీసుకున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఇందుకోసం ప్రభుత్వాన్ని నీడలా వెంటాడి.. ఒత్తిడి పెంచే ఆలోచనతో షాడో గవర్నమెంట్ నడపనున్నట్లు ప్రకటించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బీఆర్‌ఎస్ షాడో మంత్రివర్గం
తెలంగాణ రాజకీయాలపై స్పష్టమైన మార్క్ వేసింది గులాబీ పార్టీ.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతలకు న్యాయం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన అనుభవంతో ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలనే విషయమై ఓ అవగాహనకు వస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. తమ పార్టీ ఎమ్మెల్యేలు 39 మంది, మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏడుగురితో కలిపి 46 మంది ఎమ్మెల్యేల బలంతో సభలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించడంతోపాటు ప్రభుత్వ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 17 మందితో షాడో మంత్రివర్గాన్ని నియమించుకోవాలని భావిస్తోంది గులాబీ పార్టీ.
Also Read: 6 గ్యారంటీలకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. తెల్లరేషన్ కార్డు ఉండాలి: మంత్రి పొంగులేటి
హామీల అమలుపై ఒత్తిడికి వ్యూహం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా.. శాఖల వారీగా ఎమ్మెల్యేలతో బాధ్యతలు పంచుకోవాలని నిర్ణయించుకుంది గులాబీదళం. ఐతే ప్రస్తుతానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేకన్నా.. కాంగ్రెస్ చెప్పిన వంద రోజుల తర్వాత హామీలపై ఒత్తిడికి వ్యూహం సిద్ధం చేస్తోంది. శాఖల వారీగా నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించి ఆయా శాఖల్లో జరుగుతున్న పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంతో బీఆర్ఎస్ షాడో సర్కార్ పనిచేయనుంది.
Also Read: సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అమీతుమీ
మొత్తానికి బీఆర్‌ఎస్ వ్యూహం పరిశీలిస్తే.. కాంగ్రెస్ సర్కార్ ఏ ఒక్క హామీ నుంచి తప్పించుకోలేని విధంగా స్కెచ్ వేస్తోంది. పాలనలో తనకు ఉన్న పదేళ్ల అనుభవంతో కాంగ్రెస్ సర్కార్‌ను ఓ కంటి కనిపెడుతూ.. ప్రజలకు చేరువయ్యే వ్యూహంతో పనిచేయనుంది.