సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అమీతుమీ

ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలుగా కలిసిన మనసులు.. కార్మిక సంఘాలుగా మాత్రం కలవలేక పోయాయి.

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అమీతుమీ

Alliance partners Congress, CPI to lock horns in Singareni elections

Updated On : December 25, 2023 / 12:01 PM IST

Singareni Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ -సీపీఐ పార్టీలు.. సింగరేణి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు- ఐఎన్‌టీయూసీ (కాంగ్రెస్‌), ఏఐటీయూసీ (సీపీఐ) యూనియన్లు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు యూనియన్లు కలిసి పోటీ చేస్తాయని చర్చ సాగినా అది జరగలేదు. పార్టీలుగా కలిసిన మనసులు.. కార్మిక సంఘాలుగా మాత్రం కలవలేక పోయాయి.

ఈనెల 27న జరుగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ INTUC, CPI అనుబంధ AITUC ఎవరికి వారే పోటీకి సిద్ధమయ్యారు. ఈ రెండు యూనియన్ల మధ్య పొత్తు ఉంటుందని అందరూ భావించిన తరుణంలో ఆ దిశగా ఇరు పార్టీల నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో AITUC, INTUC యూనియన్లు ఎలాంటి పొత్తు లేకుండా ఎవరికి వారే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు యూనియన్ల నాయకులు ప్రచారంలో పరస్పర ఆరోపణలు, విమర్శలకు పాల్పడుతూ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్, సీపీఐ పార్టీలను కలవరపెడుతున్నప్పటికీ పరిస్థితులు అనివార్యంగా మారడంతో చేసేది ఏమీ లేక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో దోస్తీ సింగరేణిలో కుస్తీ పడుతున్న INTUC, AITUC పోరు కోల్ బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని AITUC నేతలు ఫుల్ ధీమాగా ఉన్నారు. పొత్తులు లేకుండా.. విజయం సాధిస్తామని అంటున్నారు ఎర్ర జెండా లీడర్లు. కాంగ్రెస్ విధానాలు చూసి కార్మికులు ఓట్లు వేస్తారని అంటున్నారు INTUC నేతలు చెబుతున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు.

Also Read: సీఎం పక్కన కూర్చునైనా సంతకం పెట్టిస్తా.. మీ సమస్యలు తీరుస్తా: సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి హామీ

కార్మిక వర్గంలో పట్టున్న రెండు యూనియన్లు ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. సర్దుబాటు చేసుకుని కలిసి పోటీ చేస్తే మాత్రం విజయం రెండు యూనియన్లు స్వంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విడివిడిగా తొడగొడుతున్న రెండు యూనియన్లలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.