Bus Accident
Bus Accident : గత నెల కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు అంటుకొని ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. హైదరాబాద్ – విజయవాడ రహదారిపైకూడా ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
హైదరాబాద్ నుంచి కందుకూరుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో వెళ్తుంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో బస్సు సిబ్బంది ప్రయాణీకులను అప్రమత్తం చేయడంతో వారంతా బస్సు నుంచి కిందకు దిగారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.