Telangana High Court Representative Image (Image Credit To Original Source)
Traffic Challan Payments: పెండింగ్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్ల కోసం వాహనదారులను బలవంత పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం, వాహనాలు ఆపి ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధం అని తేల్చి చెప్పింది. చలాన్ల చెల్లింపు స్వచ్ఛందంగా ఉండాలే తప్ప బలవంతంగా వసూలు చేయరాదని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించనప్పుడు నోటీసుల జారీనే చట్టబద్ధ మార్గమని న్యాయస్థానం వ్యాఖ్యనించింది.
”పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు. పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దు. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలి. చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలి” అని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది హైకోర్టు.
రోడ్డుపై నిలిపివేసి ఇబ్బందులు పెట్టడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధం అని కోర్టు చెప్పింది. ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజల హక్కులు కాపాడాలని సూచించింది. చలాన్ల వసూలులో పారదర్శకత, చట్టబద్ధత తప్పనిసరి అని వెల్లడించింది. వసూలు విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందంది. వాహనదారుల హక్కుల పరిరక్షణపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.
”తనిఖీల పేరుతో రోడ్డుపై ఆపితే వాహనదారుడే స్వచ్ఛందంగా తన పెండింగ్ చలాన్లు చెల్లించడానికి ముందుకొస్తేనే పోలీసులు వసూలు చేయొచ్చు. ఒకవేళ వాహనదారుడు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే అతడిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదు. పోలీస్ యంత్రాంగం నిబంధనలను అతిక్రమించి రోడ్లపై నేరుగా నగదు వసూలు చేయడం సరికాదు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పెండింగ్ బకాయిలను రాబట్టాలి. పెండింగ్ చలాన్ల వసూలుకు కోర్టు నోటీసులు పంపాలి” అని హైకోర్టు సూచించింది.
Traffic Police Representative Image (Image Credit To Original Source)
ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూలు కోసం వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయన తన వాదనలను వినిపించారు. పోలీసులు వాహనాలను అడ్డగించి కీస్ లాక్కోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబడుతూ ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది.
పెండింగ్ చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు వాహనదారులకు భారీ ఊరటనిచ్చాయి.