హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది న్యూ ఇయర్ ముందు డిసెంబర్ 31వ తేదీన రాత్రి, జనవరి ఒకటవ తేదీన వేడుకలకు హైదరాబాద్‌లో అనుమతులు లేవని స్పష్టం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా.. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ పేరుతో జరిగే ఎటువంటి కార్యక్రమాలకు కూడా అనుమతులు లేవని చెప్పుకొచ్చారు సజ్జనార్. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో జరిగే కార్యక్రమాలకు అనుమతులు లేవన్నారు.
డిసెంబర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అపార్ట్‌మెంట్లు, కమ్యునిటీ సెంటర్లలో కూడా వేడుకలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నైట్ మొత్తం జరగనున్నట్లుగా సజ్జనార్ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని సజ్జనార్ కోరారు.
న్యూఇయర్ క్రమంలో డిసెంబరు 31, జనవరి 1న వేడుకలు జరపరాదని స్పష్టం చేసింది. ఆ రెండు రోజులు పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా న్యూ ఇయర్ వేడుకలను రద్దు చెయ్యగా. కొత్తరకం కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన చాలా దేశాల్లో హఠాత్తుగా వేడుకలను రద్దు చేశారు. ప్రభుత్వాలు ముందుజాగ్రత్తగా వేడుకలన్నింటినీ రద్దు చేశాయి.
బ్రిటన్ అయితే రెండు వారాల పాటు దేశంలో లాక్ డౌన్ ప్రకటించగా.. ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు మళ్ళీ లాక్ డౌన్ విధించే ఆలోచనలో ఉన్నాయి.