Hyderabad to Srisailam Highway
Hyderabad to Srisailam Highway: హైదరాబాద్ – శ్రీశైలం రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రాబోయేకాలంలో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు చాలాచోట్ల ప్రమాదకరంగా, ఇరుకుగా ఉంది. ముఖ్యంగా.. 125 కిలో మీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారిలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లే 62కిలో మీటర్ల దూరం (కల్వకుర్తి-శ్రీశైలం) రెండు లైన్ల ఘాట్లతో ఇరుకుగా ఉంటూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికితోడు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రోడ్లపైకి వచ్చిన అడవి జంతువులు మూల మలుపుల వద్ద వాహనాలు ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నాయి. అయితే, రాబోయే కాలంలో ఆ ఇబ్బంది తొలగనుంది. అభయారణ్యంలో శ్రీశైలానికి సాఫీగా వెళ్లేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
Also Read: Tirumala Update: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..
హైదరాబాద్ – శ్రీశైలం రహదారి 125 కిలో మీటర్ల మంచి కండిషన్ లో ఉంది. కానీ, అమ్రాబాద్ అభయారణ్యంలో 62కిలో మీటర్ల విస్తరణకు అభివృద్ధికి నోచుకోవటం లేదు. అయితే, ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తే వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ కూడా సాఫీగా సాగిపోతుంది. అయితే, ఈ కారిడార్ కు కేంద్రం అనుమతినిచ్చింది. 62 కిలో మీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో నిర్మితమయ్యే ఈ రహదారి నిర్మాణానికి రూ.7,700 కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఈ కారిడార్ పూర్తయితే తెలంగాణ – ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది. మరోవైపు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మితమైతే శ్రీశైలం దేవస్థానంకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
Also Read: రేషన్ కార్డులు వచ్చేదెప్పుడో..! తికమక ప్రకటనలతో జనం పరేషాన్.. అసలు విషయం చెప్పిన అధికారి
నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాల మేరకు ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూరు, కుంచోనిమూల, దుర్వాసుల చెరువు ఫరహాబాద్, వటువర్లపల్లి, దోమలపెంట గిరిజన గ్రామాల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయితే ప్రయాణ ఇబ్బందులు తప్పడంతోపాటు.. రాత్రివేళల్లోనూ ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాత్రివేళల్లో అభయారణ్యంలో వాహనాలపై నిషేధం ఉంది. ఈ కారిడార్ పూర్తయితే నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉంటుంది. ఎత్తులో కారిడార్ ఉండటం వల్ల వన్యప్రాణులకు రోడ్డు ప్రమాదాల నుంచి భద్రత కలుగుతుంది.