Tirumala Update: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక మార్గాలు, ఘాట్ రోడ్లలో ప్రయాణించే ...

Tirumala Tirupati Devasthanams
Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక మార్గాలు, ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులు, వాహనదారులకు చిరుతలు, ఏనుగులు, ఎలుగు బంట్ల నుంచి ఇబ్బంది కలగకుండా టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా యానిమల్ రేడియో కాలర్ సిస్టంను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే, దీన్ని ఏర్పాటు చేయాలంటే వైల్డ్ లైఫ్ అధికారుల అనుమతి అవసరం. దీంతో టీటీడీ వారి అనుమతి కోరింది. రేడియో కాలర్ సిస్టం అనే ఆలోచనను వైల్డ్ లైఫ్ అధికారుల ముందుంచింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఈ విధానాన్ని తిరుమలలోనూ అమలు చేసేందుకు వైల్డ్ లైఫ్ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
తిరుమల పరిసర ప్రాంతాల్లో సంచరించే చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లతో పాటు జింకలకు రేడియో కాలర్ సిస్టం ను ఏర్పాటు చేయాలని వైల్డ్ లైఫ్ అధికారులను టీటీడీ కోరింది. దీని ద్వారా ఆయా జంతువులు జన సంచారం సమీపానికి వస్తే వెంటనే అలర్ట్ కావడానికి వీలుంటుందనే అభిప్రాయాన్ని టీటీడీ ఫారెస్ట్ అధికారులు వ్యక్తపరిచారు. దీంతో వైల్డ్ లైఫ్ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వారి నుంచి అనుమతి రాగానే తొలుత జంతువులను ట్రాప్ చేసి పట్టుకుంటారు. ఆ తరువాత సిమ్ తో కూడిన రేడియో కాలర్ పరికరాన్ని ఆయా జంతువులకు అమర్చుతారు.
2023 ఆగస్టు 12న అలిపిరి కాలిబాటలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడిచేసి చంపేసింది. ఆ తరువాత కూడా పలుసార్లు చిరుత, ఎలుగుబంట్లు కాలినడకన వెళ్లే భక్తులపై దాడిచేసేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఏడెనిమిది వరకు చిరుతలను టీటీడీ అధికారులు, అటవీ శాఖ అధికారులు బోనుల్లో బంధించి జూపార్కుకు తరలించారు. ఆ తరువాత కూడా కాలినడక మార్గంలో పలుసార్లు చిరుత, ఎలుగుబంట్ల సంచారం కనిపించింది. దీనికితోడు తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్ రోడ్డులో చిరుతలు కనిపిస్తూనే ఉన్నాయి. మొదటి ఘాట్ లోని ఏడో మైలు వద్ద, పార్వేట మండపం, శ్రీవారి పాదాల మార్గంలో ఏనుగుల గుంపు కూడా సంచరిస్తున్నక్రమంలో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
అడవి జంతువుల నుంచి భక్తులకు రక్షణ కల్పించేలా టీటీడీ అన్నివిధాల చర్యలు తీసుకుంటుంది. అయినా, పలుసార్లు అడవి జంతువుల కదలికలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో యానిమల్ రేడియో కాలర్ సిస్టంను అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలో సంచరించే జంతువులను ట్రాప్ చేసి పట్టుకొని.. వాటికి సిమ్ తో కూడిన రేడియో కాలర్ పరికరాన్ని అమర్చుతారు. తిరుమలలో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ఆధారంగా జంతువుల కదలికలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి భక్తులకు సమీపానికి వస్తే వెంటనే అప్రమత్తం చేయడంతోపాటు వాటిని అడవిలోకి తరిమేలా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రేడియో కాలర్ సిస్టం అందుబాటులోకి వస్తే అడవి జంతువుల భయం భక్తులకు ఇక ఉండదని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.