రేషన్ కార్డులు వచ్చేదెప్పుడు? మీక్కూడా ఈ డౌట్ ఉందా?.. అసలు విషయం చెప్పిన అధికారులు..

కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ..

రేషన్ కార్డులు వచ్చేదెప్పుడు? మీక్కూడా ఈ డౌట్ ఉందా?.. అసలు విషయం చెప్పిన అధికారులు..

CM Revanth Reddy

Updated On : March 3, 2025 / 12:42 PM IST

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డుల ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దీనికితోడు తికమక ప్రకటనలతో జనం పరేషాన్ అవుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైందని చెబుతున్నప్పటికీ.. మిగిలిన జిల్లాలు మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ఎందుకు కాలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 

హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 1వ తేదీ నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని గతంలో ప్రకటించారు. దీంతో నగర వాసులు కార్డుల కోసం వేచి చూస్తున్నారు. కానీ, మార్చి నెల ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఊసేలేదు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నట్లు తెలిసింది.

 

హైదరాబాద్ కోర్ సిటీ పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలోని ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 6,39,451 రేషన్ కార్డులున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో 5.40లక్షల మంది, కుల గణన సర్వేలో 83వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించడంతో ప్రజలంతా మళ్లీ క్యూలు కట్టారు. దీంతో రెండు వారాల్లోనే 1,31, 484 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

 

ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేకంగా చిప్ ఉండేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం సైతం చేశారు. అయినా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో కొత్త రేషన్ కార్డులను సాధారణ పద్దతిలోనే ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినా.. కార్డుల పంపిణీలో ముందడగు పడటం లేదు.

 

రేషన్ కార్డుల జారీ ఆలస్యంపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. నాలుగు నెలల కింద గ్రేటర్ పరిధిలో నిర్వహించిన కులగణన సర్వేలో దరఖాస్తుల్లో అర్హుల జాబితా వివరాలు ఇప్పటికీ మాకు అందలేదు. తాజాగా మీ సేవ కేంద్రాల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల వివరాలు కూడా పూర్తిగా అందలేదు. ఈ దరఖాస్తులు మాకు చేరితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గర్తిస్తామని సమాధానం ఇచ్చారు.