Chaitanya College Students Fight : ఖమ్మంలో చైతన్య కళాశాల విద్యార్థుల ఘర్షణ కలకలం రేపింది. ఓ స్టూడెంట్ పై అదే కాలేజీకి చెందిన విద్యార్థులు కర్రలతో దాడి చేశారు. విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన స్టూడెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థులు గొడవపడ్డారు. రెండు గ్రూపులుగా ఏర్పడ్డ విద్యార్థులు.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. గొడవపడుతున్న విద్యార్థులను మరో విద్యార్థి ఆపాడు. ఆ విద్యార్థిపైనే ఇవాళ ఓ వర్గం విద్యార్థులు దాడి చేశారు. నిన్న జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకున్న ఓ వర్గం విద్యార్థులు.. శనివారం మధ్యాహ్నం కాలేజీ నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థిపై దాడికి దిగారు. కర్రలతో చితకబాదారు. దీంతో ఆ విద్యార్థి ముఖం, మూతి, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థికి ప్రమాదం లేకపోయినా తీవ్రమైన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, దీనిపై కాలేజీ యాజమాన్యం మాత్రం స్పందించలేదు. తమకేమీ తెలియదన్నట్లుగా సమాధానం చెప్పింది.
విద్యార్థుల మధ్య ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థులను భయాందోళనకు గురి చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కగా కాలేజీకి వెళ్లి బుద్ధిగా క్లాస్ పుస్తకాలు చదువుకోవాల్సిన విద్యార్థులు.. ఇలా వీధి రౌడీల్లా కర్రలతో దాడికి దిగడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ పరిణామం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు.