Chandrababu On Hyderabad : హైదరాబాద్ అభివృద్ధికి కారణం నేనే, ఇక్కడా పార్టీని బలోపేతం చేస్తా-చంద్రబాబు

ఊరికే హైటెక్ సిటీ నిర్మాణం అవుతుందా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బీ హైదరాబాద్ కు తెచ్చింది నేనే..(Chandrababu On Hyderabad Development)

Chandrababu On Hyderabad Development : తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో జరిగిన వేడుక‌ల్లో ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం నేనే అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఊరికే హైటెక్ సిటీ నిర్మాణం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. తన కృషి, ముందు చూపు వల్లే హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బీ హైదరాబాద్ కు తెచ్చింది నేనే అని చంద్రబాబు చెప్పారు. రాను అని చెప్పిన వారిని నా దగ్గరకు రప్పించుకొని ఆ తర్వాత తప్పించుకోకుండా ఉంచడం నాకు తెలుసు అని చంద్రబాబు అన్నారు.

బయోటెక్నాలజీకి మంచి రోజులు వస్తున్నాయని ముందే ఊహించి, జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు. ఇప్పుడు జినోమ్ వ్యాలీలో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడం గొప్ప పరిణామం అని చెప్పారు. బిల్ గేట్స్ 5 నిమిషాలు సమయం ఇచ్చి… అరగంట నాతో మాట్లాడారని చంద్రబాబు చెప్పారు. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి బిల్ గేట్స్ ఆకర్షితుడు అయ్యారని చెప్పుకొచ్చారు.(Chandrababu On Hyderabad Development)

దావోస్ కు వెళ్లి బిల్ గేట్స్ తో సమావేశం నిర్వహించానని, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో పెడతామని చెప్పి… ఇక్కడే పెట్టారని, అప్పటినుంచి నాకు మంచి స్నేహితుడు అయ్యారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలుగువాడు అయ్యాడని, ఇది మనందరికి గర్వకారణం అని చంద్రబాబు అన్నారు. 32 సమావేశాల తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు వచ్చిందన్నారు చంద్రబాబు. విజన్ 2020 తయారు చేస్తే ఈ 420 లు నన్ను ఎగతాళి చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పుడున్న సీఎంలు చేతనైతే ఇంకా అభివృద్ధి చేయాలని, చేత కాకపోతే వదలి పెట్టండని చంద్రబాబు అన్నారు. తాను తెలంగాణను అభివృద్ధి చేశాను తప్ప, ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు.

Chandrababu On Youth Seats : వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 40శాతం సీట్లు.. చంద్రబాబు కీలక ప్రకటన

హైదరాబాద్ లో అడుగడుగునా తన కష్టం ఉందన్నారు చంద్రబాబు. ఏపీ రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్చందంగా ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే, దానికి కులం రంగు పులిమారని వాపోయారు. ఇప్పుడు కోకాపేటలో భూమి ధర కోట్లు పలుకుతోందన్న చంద్రబాబు… గతంలో రూ.60వేలు, రూ.70వేలే ఉండేదన్నారు. పుల్లెల గోపీచంద్ కు ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకుంటూ మంచి క్రీడాకారులు తయారు చేస్తున్నారని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

టీడీపీ.. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు చంద్రబాబు. తెలుగుగంగా ఎన్టీఆర్ పుణ్యమే అన్న చంద్రబాబు.. ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించింది ఎన్టీఆర్ అని, పూర్తి చేసింది టీడీపీ అని గుర్తు చేశారు. విభజన తర్వాత తెలంగాణలో ఒక ప్రాజెక్టు మాత్రమే కట్టారని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కట్టి నదుల అనుసంధానం చేశామన్నారు. ఏపీలో ప్రాజెక్టుల పరిస్థితి ఏమైందో తెలియదన్న చంద్రబాబు.. రాజకీయ నాయకులను అడగాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాను అని చంద్రబాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు