Bheem Bharat, Kale Yadaiah (Image Credit To Original Source)
Congress: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోటలో చిచ్చు రేగింది. స్నేహ గీతం పాడిన చోట..ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య..కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జ్ భీం భరత్..పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటి దాకా ఒకే వేదికపై కనిపించిన నేతల మధ్య ఇప్పుడు మామూళ్ల బాగోతంపై రచ్చ మొదలైంది. భీం భరత్‌కు మామూళ్లు ఇచ్చాను అంటూ ఎమ్మెల్యే పేల్చిన బాంబ్ మున్సిపల్ ఎన్నికల వేళ కాకరేపుతోంది.
దీంతో చేవెళ్ల కాంగ్రెస్‌లో ఇప్పుడు కలహాల కాపురం రోడ్డుకెక్కింది. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్‌లో ఉన్నారా.? కాంగ్రెస్‌లో ఉన్నారా.? అన్న సస్పెన్స్ కంటే..ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్ రచ్చ చేస్తున్నాయి. ఎమ్మెల్యే యాదయ్య..ఇంచార్జ్ భీం భరత్‌కు మామూళ్లు ఇచ్చానని చెప్పడమే కాకుండా..తనపై సొంత ఊరి వాళ్లతోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేయించి తన పరపతిని దెబ్బతీస్తారా.? అంటూ బహిరంగంగా కామెంట్స్ చేశారు.
Also Read: ఒకే పార్టీలో ఉంటూ.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే స్కెచ్
ఎమ్మెల్యే యాదయ్య కామెంట్స్‌పై భీం భరత్ సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. మామూళ్లు ఎక్కడ ఇచ్చావో..ఎప్పుడు ఇచ్చావో నిరూపించు..లేదంటే తలవంచు అంటూ ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసురుతున్నారు. నిరూపించకపోతే..చేవెళ్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాయాలంటూ సవాల్ విసురుతున్నారు. కాల యాదయ్య చేసిన కామెంట్స్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు..చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎలా తిరుగుతాడో చూస్తానంటూ సవాల్ విసురుతున్నాడు.
పొలిటికల్ చదరంగంలో చెక్ పడేది ఎవరికి?
దీంతో చేవెళ్ల పొలిటికల్ చదరంగంలో చెక్ పడేది ఎవరికి? ఇప్పుడు చేవెళ్ల పంచాయితీ గాంధీభవన్ మెట్లు ఎక్కుతుందా.? లేక సీఎం రేవంత్ దాకా వెళ్తుందా.? అనేది చర్చగా మారింది. మామూళ్ల ఆరోపణలపై విచారణ జరుగుతుందా.? లేక ఇది కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్కా? చేవెళ్లలో రగులుతున్న ఈ సెగ..ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో రోజుకొక చోట రచ్చ తెరమీదకు వస్తుండటంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే పటాన్‌చెరు, జగిత్యాల, గద్వాల్ నియోజకవర్గాల్లో వర్గపోరు నిత్యం రగులుతూనే ఉంది. లేటెస్ట్‌గా ఈ జాబితాలోకి మరో నియోజకవర్గం వచ్చి చేరింది.
పురపోరు వేళ చేవెళ్ల పంచాయితీ ఇబ్బందికరంగా మారిందట. నిన్నటి దాకా ఒకే వేదికపై కనిపించిన నేతల మధ్య ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటుండటంతో ఇది ఎటువైపు దారితీస్తుందో..కాంగ్రెస్ పెద్దలు చేవెళ్ల పంచాయితీకి ఎలా ఎండ్‌కార్డ్ వేస్తారోనన్నది వేచి చూడాలి.