ఒకే పార్టీలో ఉంటూ.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే స్కెచ్
త్వరలో వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్‌గా తోట త్రిమూర్తులు లేకపోతే చెల్లుబోయిన వేణుగోపాల్‌కు అవకాశం ఇస్తారని ఓ ప్రచారం నడుస్తోంది.
Pilli Subhash Chandra Bose (Image Credit To Original Source)
- కోనసీమ జిల్లాలో వైసీపీ లీడర్ల మధ్య కోల్డ్‌వార్..!
- రామచంద్రపురం నియోజకవర్గం సెంట్రిక్‌గా నేతల ఫైట్..
- ముగ్గురు చేతులు కలిసేదెప్పుడు?
- ఈ కోల్డ్‌వార్‌కు ఎండ్ కార్డే లేదా..?
Pilli Subhash Chandra Bose: అధికారం పోయింది. వైసీపీ అపోజిషన్‌లో ఉంది. అయినా సరే ఫ్యాన్ పార్టీ లీడర్లు వర్గపోరును మాత్రం వదలట్లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అయితే ముగ్గురు నేతల మధ్య రాజకీయం..ప్రోకబడ్డీ ఫైట్‌ను తలపిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న రామచంద్రపురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్..గత ఎన్నికల్లో తన తనయుడు పిల్లి సూర్య ప్రకాశ్‌కు టికెట్ ఇప్పించుకుని గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.
కానీ కూటమి గాలికి ఓటమి తప్పలేదు. ఎంపీ బోస్ మాత్రం రామచంద్రపురం నియోజవర్గంలో పార్టీ కార్యక్రమంలో నేనున్నానని చెప్పుకునేలా తన కొడుకుతో పాటు కనిపిస్తున్నారు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక అదే నియోజకవర్గంతో సంబంధం ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..అంతకముందు మంత్రిగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాల్‌తో..పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కోల్డ్ వార్ నడుస్తోందట.
సీనియర్ లీడర్..సిన్సియర్ పొలిటీషియన్..జగన్‌కు విధేయుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు..అటు తోట త్రిమూర్తులు..ఇటు చెల్లుబోయిన వేణుగోపాల్‌తో ఏ మాత్రం గిట్టడం లేదట. ఇదేం కొత్త కాకపోయినా..లేటెస్ట్‌గా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Also Read: చంద్రన్న కోసం బండ్లన్న యాత్ర.. కారణాలేంటి? ట్రెండింగ్ టాక్స్
విపక్ష వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కవవుతున్నాయా.? పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన ఆరోపణలకు కారణాలేంటి.? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ హయాంలో పేదల గృహ నిర్మాణం పేరుతో రూ.కోటి 23 లక్షలు దోచుకున్నారని ఎంపీ బోస్ ఆరోపించారు. పేదలకు న్యాయం చేయాలని తాను సీఎం చంద్రబాబును త్వరలో కలుస్తానంటున్నారు.
వైసీపీకి సీనియర్ నేత..తమ పార్టీ వారు పేదలను మోసం చేశారని, వారిపై చర్యలను తీసుకోవాలంటూ ప్రభుత్వాధినేతను కలవాలని డిసైడ్ చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఏ ఉద్దేశంతో ఎంపీ బోస్ ఇలాంటి ప్రకటన చేశారన్నది డిబేట్‌గా మారింది. ఎంపీ బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. 2019 ఎన్నికల్లో ఆయనను కాదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈ స్థానం నుంచి పోటీకి పెట్టింది వైసీపీ.
అప్పట్లో వేణు భారీ మెజార్టీతో గెలుపు
అప్పట్లో వైసీపీ గాలి వీయడంతో వేణు భారీ మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో మండపేట నుంచి పోటీ చేసిన బోస్ ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల తర్వాత మొదట ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పల్లి సుభాష్ చంద్రబోస్‌ను మంత్రిని చేశారు. అయితే మండలి రద్దు చేయాలన్న మాజీ సీఎం జగన్ నిర్ణయంతో బోస్ మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ స్థానం తీసుకున్నారు.
ఇక బోస్ స్థానంలో అప్పటి రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి అయ్యారు. 2024 వరకు వేణు మంత్రిగా కొనసాగారు. ఈ టర్మ్‌లో ఎంపీ బోస్, మాజీ మంత్రి వేణు వర్గాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండేవని చెబుతున్నారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి రామచంద్రపురం నుంచి తన కొడుకు పిల్లి సూర్యప్రకాశ్‌ను బరిలోకి దించారు సుభాష్ చంద్రబోస్.
త్వరలో పదవీ విరమణ చేయనున్న ఎంపీ బోస్ వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల పేరుతో పేదల డబ్బును స్వాహా చేశారని ఆరోపించడం సంచలనం రేపుతోంది. మెప్మా ద్వారా పేదలు రుణాలు తీసుకుని ఆ డబ్బును నలుగురికి చెల్లించారని, ఆ నలుగురు వైసీపీ వారేనని ఎంపీ చెబుతున్నారు. రూ. కోటి 23 లక్షలు తీసుకుని ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరుతానంటున్నారు బోస్.
బహిరంగంగా ఆరోపణలు ఎందుకు?
అయితే ఇన్నాళ్లు ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్న బోస్ ఇప్పుడు బహిరంగంగా ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. మరో నాలుగు నెలల్లో ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతుంది. ఎంపీ బోస్ ఆవేదనలో పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నా, అంతకు మించిన రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా.? అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
తమ పార్టీ వారే డబ్బు వసూలు చేశారని చెబుతున్న బోస్..అధికారంలో ఉన్నప్పుడు వారిపై చర్యలకు ఎందుకు ఒత్తిడి చేయలేకపోయారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని ఇరుకనపెట్టాలనే ఉద్దేశంతోనే బోస్ ఆరోపణలు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే త్వరలో వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తారన్న టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ ఇంచార్జ్‌గా తోట త్రిమూర్తులు లేకపోతే చెల్లుబోయిన వేణుగోపాల్‌కు అవకాశం ఇస్తారని ఓ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్ ఉన్నారు.
అటు తోట త్రిమూర్తులు, ఇటు చెల్లుబోయిన వేణు ఇద్దరిట్లో ఎవరికి రామచంద్రపురం ఇంచార్జ్‌గా నియమించినా తన కుమారుడికి ఓ నియోజకవర్గం అంటూ లేకుండా పోతుందని..సీనియర్ లీడర్‌గా తన పట్టు జారిపోయే ప్రమాదం ఉందనే..పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారన్న చర్చ అయితే జరుగుతోంది. మరి ఆరోపణల వెనుక కారణమేంటో.? ఇప్పుడే అవినీతి వ్యవహారం ఎందుకు గుర్తుకు వచ్చిందో..ఆయనే సమాధానం చెప్పాలంటున్నాయి రాజకీయ వర్గాలు.
