KCR Dwcra : డ్వాక్రా మహిళలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఆ డబ్బులు వెనక్కి

డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం డబ్బులను తిరిగి డ్వాక్రా మహిళలకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

KCR Dwcra : డ్వాక్రా మహిళలకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఆ డబ్బులు వెనక్కి

Kcr Dwcra

Updated On : March 12, 2022 / 9:16 PM IST

KCR Dwcra : తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. డ్వాక్రా సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం డబ్బులను తిరిగి డ్వాక్రా మహిళలకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రూ.545 కోట్ల మేర కాంట్రిబ్యూటరీ పెన్షన్ నిమిత్తం పొదుపు చేశారు. అందుకోసం ఒక్కొక్కరూ రూ.500 చెల్లించారు. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆసరా పథకం కింద పెన్షన్ రూపంలో ఒక్కొక్క డ్వాక్రా మహిళకు నెలకు రూ.2016 చెల్లిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, గతంలో తాము అభయహస్తం పథకం కోసం చెల్లించిన నిధులను తిరిగి ఇవ్వాలని డ్వాక్రా మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పేదరిక నిర్మూలన సంస్థ దగ్గరున్న ఆ నిధులను మరికొన్ని రోజుల్లో డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అభయహస్తం నిధుల తిరిగి చెల్లించే విధివిధానాలపై చర్చించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం కింద మొదట్లో రూ.వెయ్యి పెన్షన్ గా ఇచ్చేవారు. ఇప్పుడు రూ.2016 పెన్షన్‌గా ఇస్తున్నారు. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్‌ వస్తున్న దృష్ట్యా.. మహిళలు సైతం అభయహస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వారి కోరిక మేరకు ఆ నిధులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.