Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ వెయ్యి కోట్లు లంచం తీసుకున్నారు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా- రేవంత్ రెడ్డి

ప్రతీ ఏటా 16వేల కోట్లు కొనుగోలు ఖర్చు చూపిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.8వేల కోట్లు దోచుకుంటున్నారు. (Revanth Reddy)

Revanth Reddy(Photo : Google)

Revanth Reddy – CM KCR : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై విరుచుకుపడ్డారు. సంచలన ఆరోపణలు చేశారు.

హైదరాబాద్ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ ను, రేవంత్ ను తిట్టకుండా బీఆర్ఎస్ నేతలకు రోజు గడవడం లేదన్నారు. ఇన్నాళ్లు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు బుకాయిస్తూ వచ్చారని చెప్పారు. 24 గంటల విద్యుత్ సింగిల్ ఫేజ్ అని సీఎండీ ప్రభాకర్ రావు జనవరి 30న చెప్పారని, 24 గంటలూ త్రీ ఫేజ్ ఇవ్వడం లేదని సీఎండీనే ఒప్పుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. నేను అమెరికాలో, హైదరాబాద్ లో ప్రశ్నించింది ఇదే అని రేవంత్ రెడ్డి అన్నారు.(Revanth Reddy)

ప్లేస్ నువ్వు ఫిక్స్ చెయ్యి.. నేనొస్తా..
”24 గంటల కరెంటు ఇవ్వకుండా ప్రతీ ఏటా 16వేల కోట్లు కొనుగోలు ఖర్చు చూపిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.8వేల కోట్లు దోచుకుంటున్నారు. ఉచిత విద్యుత్ ను కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారని నేను చెప్పా. దీనిపై కేటీఆర్ కల్లు తాగిన కోతిలా గెంతులు వేస్తుండు. రైతు వేదికల్లో చర్చ పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే నేను అక్కడికి వస్తా. సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్ రైతు వేదికలో ఎక్కడికి రావాలో చెప్పాలి. 24 గంటల కరెంటుపై ఆధారాలతో సహా ఇద్దరం చర్చిద్దాం.

Also Read..KCR Strategy: ఆశావహులు, అసమ్మతి నేతలు జారిపోకుండా కేసీఆర్ కొత్త వ్యూహం.. జంప్ జిలానీలకు చెక్!

వెయ్యి కోట్లు లంచం తీసుకుని..
కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ అందిస్తానని చెప్పినా.. థర్మల్ విద్యుత్ ను కేసీఆర్ తెరపైకి తెచ్చారు. దేశంలో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని పెంచింది కాంగ్రెస్. కేటీపీఎస్ 2015లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 5,280 కోట్లకు టెండర్ పిలిచారు. ఒక మెగావాట్ 5 కోట్ల 50 లక్షలకు ఉత్పత్తి చేయొచ్చని బీహెచ్ ఈఎల్ టెండర్ దక్కించుకుంది.

ఎన్టీపీసీ 1600 మెగావాట్ల ఉత్పత్తికి 10,997 కోట్లకు టెండర్ పిలిచారు. 6 కోట్ల 80 లక్షలకే ఒక మెగావాట్ ఉత్పత్తి చేసేలా టెండర్ వేసింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని 2011-12లో చట్టం తెచ్చింది. గుజరాత్ ఇండియా బుల్స్ వద్ద కేసీఆర్, కేటీఆర్ వెయ్యి కోట్లు లంచం తీసుకుని సబ్ క్రిటికల్ టెక్నాలజీని తెచ్చుకున్నారు.(Revanth Reddy)

రూ.14వేల కోట్లకుపైగా నష్టం..
కేసీఆర్ అవినీతి వల్ల కేటీపీఎస్ రూ.945కోట్లు, భద్రాద్రి రూ.4,538 కోట్లు, యాదాద్రి రూ.9,384 కోట్ల నష్టం జరిగింది. మొత్తం రూ.14వేల కోట్లకుపైగా నష్టం జరిగింది. మూడు ప్రాజెక్టులు కలిపి రూ.45వేల 730 కోట్లకు టెండరు పిలిచారు. ఇందులో 30శాతం కేసీఆర్ కమీషన్ కొట్టేశారు. ఇది 30శాతం కమీషన్ సర్కార్. టెండర్లలో రూ.15వేల కోట్లు నొక్కిన దొంగ కేసీఆర్.

పగలుకు, రాత్రికి తేడా తెలియనోడు..
బీహెచ్ఈఎల్ ద్వారా కేసీఆర్ అనుచరులకు పనులు అప్పగించారు. బీహెచ్ఈఎల్ నుంచి ఏ ధరకు ఏయే కంపెనీలకు పనులు అప్పగించారో బయటపెట్టాలి. కేటీఆర్.. రాహుల్ గాంధీకి క్లబ్బు, పబ్బు తప్ప వ్యవసాయం తెలియదంటావా? పగలుకు, రాత్రికి తేడా తెలియని నువ్వు రాహుల్ ను విమర్శిస్తావా? అసలు కేటీఆర్ కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్ కు వ్యవసాయం తెలియదు. రైతులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. రాహుల్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ ను ఎక్కడికక్కడ అడ్డుకోండి.(Revanth Reddy)

Also Read..Siddipet Govt school : ఈ ప్రభుత్వ స్కూల్లో సీటు దొరకాలంటే అంత ఈజీ కాదు,మంత్రులు రికమెండేషన్ ఉన్నా కష్టమే..ఎందుకంత డిమాండ్..?

వారు చీకటి మిత్రులు, ఫెవికాల్ బంధం..
24గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతు వేదికలకు తాళం పెట్టి నిరసన తెలపండి. రుణమాఫీ, పోడు భూముల పట్టాలకు 24 గంటల కరెంటు ఇచ్చే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయండి. అవగాహన లేకే కేటీఆర్ నాపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. చేసిన దోపిడీని కప్పిపుచుకునేందుకే నాపై కేటీఆర్ విమర్శలు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులు. వారిద్దరిది ఫెవికాల్ బంధం. కాంగ్రెస్ ది జలయజ్ఞం. బీఆర్ఎస్ ది ధనయజ్ఞం. మూడోసారి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కు గజ్వేల్ లో పోటీ చేయడానికి భయం ఎందుకు? సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.