Hare Krishna Tower
Hare Krishna Tower: హైదరాబాద్ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీ కృష్ణ గో సేవామండలి విరాళంతో హేరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణంకు చర్యలు చేపట్టారు. ఈ నిర్మాణ పనులకు సోమవారం సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని అన్నారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని కేసీఆర్ అన్నారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే అన్నారు. హరేకృష్ణ ఫండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయమని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఎంతో చిత్తశుద్ది ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయని పేర్కొన్నారు.
నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామమని, ఆలయ నిర్మాణానికి రూ. 25కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆధ్యాత్మికతను పెంపొందించేలా రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని, వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
Hare Krishna Tower
హెరిటేజ్ టవర్ ప్రత్యేకతలు..
– కోకాపేట ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తులో ప్రతిష్టాత్మకంగా హేరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ (ఆలయం) నిర్మాణం చేపట్టనున్నారు.
♦ హైదరాబాద్‌కు సాంస్కృతిక మైలురాయిగా ఈ టవర్ నిలవనుంది.
♦ ఈ ఆలయ మండపంలో రాధాకృష్ణులతో పాటు ఎనిమిది మంది ప్రధాన గోపికల విగ్రహాలనూ ప్రతిష్టించనున్నారు.
♦ తిరుమల తరహాలో అతిపెద్ద ప్రాకారంతో కూడిన శ్రీనివాసుడి ఆలయం కూడా ఇందులో ఏర్పాటు కానుంది.
♦ ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టుగా రూపొందే ఈ హెరిటేజ్ టవర్ కాకతీయ, చాళుక్య, ద్రవిడ చక్రవర్తుల కాలం నాటి కట్టడాల శైలిని పోలి ఉంటుంది.
♦ ఈ హెరిటేజ్ టవర్‌లో మ్యూజియం, గ్రంథాలయంతో పాటు థియేటర్ ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మికభావం పెంపొందించేలా మందిరాలు, హోలోగ్రామ్, లేజర్ ప్రొజెక్టర్లతో కూడిన ఇతరత్రా ఆదునిక సౌకర్యాలూ అందుబాటులోకి తేనున్నారు.
♦ ఉచిత అన్నదాన సత్రంకూడా ఏర్పాటు చేయనున్నారు.
♦ వయోవృద్ధులు, దివ్యాంగులకోసం ఎలివేటర్లు, ర్యాంపులతో పాటు భక్తులు నిరీక్షించేందుకు క్యూ హాల్ నిర్మించనున్నారు.
♦ ఇటీవల హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నమూనాను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు.