KCR: కుదుటపడిన కేసీఆర్ ఆరోగ్యం.. ఎన్నికల ప్రచారానికి సిద్ధం

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యం కుదుటపడింది. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడ్డ ముఖ్యమంత్రి ఆదివారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు.

KCR: కుదుటపడిన కేసీఆర్ ఆరోగ్యం.. ఎన్నికల ప్రచారానికి సిద్ధం

cm kcr recovered from viral fever and ready election campaign

CM KCR : దాదాపు మూడు వారాల తర్వాత సీఎం కేసీఆర్‌ ఎన్నికల కసరత్తుపై ఫోకస్ పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం వైరల్ జ్వరం బారిన పడ్డ కేసీఆర్ ఇప్పటి వరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కీలక నేతలతో ఆరా తీశారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యం కుదుటపడింది. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడ్డ ముఖ్యమంత్రి ఆదివారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, మంత్రి హరీశ్‌ రావుతో సుదీర్ఘ చర్చలు జరిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం అనారోగ్యానికి గురై ప్రగతి భవన్‌లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదటపడడంతో.. ఇక ఎన్నికల  వ్యూహాలకు పదును పెట్టడంపై దృష్టి సారించారు. అధికారిక కార్యక్రమాలకు  ఇన్ని రోజులు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్‌ త్వరలో పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సూచనలతో మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు కొన్ని రోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్కో రోజు మూడు, నాలుగు జిల్లాల్లో పర్యటిస్తూ.. ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని దాదాపు పూర్తి చేశారు. అధినేత కేసీఆర్ అందుబాటులో లేకపోయినా  పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ ఇద్దరు నేతలు పర్యవేక్షించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా ప్రజా క్షేత్రంలోకి ఎంటర్ కానున్నారు.

Also Read: కాంగ్రెస్ తో కోదండరాం మంతనాలు.. ఎన్ని సీట్లు అడిగారో తెలుసా?

ఈ నెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలోనే పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయాలని పార్టీ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అధినేత కేసీఆర్ సూచనలతో  ప్రజల మ్యానిఫెస్టో సిద్ధం చేయడంపై గులాబీ పార్టీ కీలక నేతలు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలు ఓ ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో మరింత లబ్ధి చేకూర్చేలా పథకాలను సిద్ధం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు క్షేత్రస్థాయిలో ఏ మేరకు స్పందన దక్కుతుందా పరిశీలించి అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పథకాలను రూపొందించే పనిలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్.. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పటి వరకు రాకపోవడంతో త్వరలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మందు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం అనవాయితీగా వస్తోంది. పెండింగ్ అంశాలకు ఈ మంత్రి వర్గ సమావేశంలో క్లియరెన్స్ ఇవ్వొచ్చునని తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి  కోలుకోవడం.. యధావిధిగా రోజు వారి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతుండడంతో గులాబీ నేతలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది. ఇక, కేసీఆర్ ఎంట్రీతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కనుంది.